ఆ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న మోదీ సైన్యం?

ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో ఓ కామెంట్ పెట్టినందుకు ఓ గుజరాత్ ఎమ్మెల్యేకు మోదీ సైన్యం చుక్కలు చూపిస్తోంది. ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతూ ఇబ్బందులు పెడుతోంది. గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ మోదీపై ఓ సోషల్ మీడియా పోస్టు పెట్టాడు. అంతే.. ఆయనపై అసోంలో కేసు నమోదు అయ్యింది. అసోం పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అయితే ఆ కేసులో జిగ్నేశ్‌కు  బెయిల్‌ వచ్చింది. మళ్లీ కాసేపటికే ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.

తాజాగా జిగ్నేశ్‌ను బార్పేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. జిగ్నేశ్‌ను  ఏ కేసులో అరెస్టు చేస్తున్నది మాత్రం పోలీసులు చెప్పలేదు. తనను ప్రధాని కార్యాలయం వేధిస్తోందని జిగ్నేశ్ ఆరోపిస్తున్నారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే తన అరెస్టు జరిగిందని జిగ్నేశ్‌ మేవానీ అంటున్నారు. తన అరెస్టు బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ కుట్రగా ఆయన విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టు చేసిన వ్యవహారంలో ఈ నెల 19న జిగ్నేశ్‌ను అసోంలోని కొక్రాఝర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

సోమవారం అసోంలోని కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇప్పుడు మరో కేసులో అరెస్టు చేశారు. ఇంకెన్ని అరెస్టులు ఉంటాయో మరి. అధికారంలో ఉన్నవాళ్లు టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో జిగ్నేశ్ మేవానీ కేసు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలోనూ మనం ఇలాంటి కేసులు చూశాం.
ఏపీలో చింతమనేని ప్రభాకర్‌ను జగన్ సర్కారు ఇలాగే వేధించింది. ఓ కేసులో బెయిల్ రాగానే మరో కేసులో అరెస్టు సిద్ధంగా ఉండేది..

సేమ్ ఇదే తరహా ట్రీట్‌ మెంట్ కేసీఆర్ సర్కారు కూడా తీన్మార్ మల్లన్న విషయంలో చూపించింది. ఆయన్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి.. జైళ్లు తిప్పుతూనే ఉండేవారు. అయితే.. ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోలేమా అంటే.. ప్రస్తుతానికి అడ్డుకోలేం.. అందుకే అంబేద్కర్ ఆనాడే చెప్పారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వాళ్లు గొప్పవాళ్లు కాకపోతే.. దాని  ఫలితాలు దారుణంగా ఉంటాయని.. ఇప్పుడు ఈ కేసుల ద్వారా అది మరోసారి రుజువు అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: