యూపీలో ఓడితే మోదీ, షాల‌కు చిక్కులు త‌ప్ప‌వా..?

యూపీతో స‌హా ఐదు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌వైపు దేశం మొత్తం చూస్తున్న త‌రుణ‌మిది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఏడు ద‌శ‌ల‌కుగాను నాలుగు ద‌శ‌ల ఎన్నిక‌లు ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏవిధంగా ఉండ‌బోతున్నాయ‌నే అంశంపై ప‌లు ర‌కాల విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. యూపీలో బీజేపీ ఓట‌మి పాలైతే దేశ రాజ‌కీయాల్లో సైతం ఆ పార్టీకి ఖ‌చ్చితంగా గ‌డ్డు రోజులు మొద‌లైన‌ట్టే. అంతేకాదు.. మోదీ, అమిత్‌షాల హ‌వాకు అడ్డుక‌ట్ట ప‌డ‌ట‌మే కాకుండా సొంత పార్టీలోనే వారికి సెగ త‌గ‌ల‌డం కూడా ఖాయ‌మేన‌ని చెప్పాలి. మోదీకి ప్ర‌త్యామ్నాయంగా మ‌రొక నేత‌ను ఎంపిక చేసుకోవాల్సిన ఆగ‌త్యం పార్టీకి ఏర్ప‌డ‌వ‌చ్చు. బ‌హుశా నితిన్ గ‌డ్క‌రీ వంటి అంద‌రికీ ఆమోద‌యోగ్యుడు, వివాద ర‌హితుడైన నాయ‌కుడివైపు పార్టీ మొగ్గు చూపే అవ‌కాశ‌ముంది. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్‌లో గ‌డ్క‌రీకి ఉన్న ప‌లుకుబ‌డి ఇందుకు ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు. అనివార్య ప‌రిస్థితుల్లో గుజ‌రాతీ ద్వ‌యం కూడా అందుకు అంగీక‌రించ‌క త‌ప్ప‌క‌పోవ‌చ్చు. అంతేకాదు.. గుజ‌రాత్ అభివృద్ధి మోడ‌ల్‌ను చూపించి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న మోదీ హ‌యాంలో బీజేపీ పాల‌న‌లో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ప‌రంగా త‌న‌దైన ముద్ర వేయ‌లేక‌పోయింద‌న్న వాద‌న‌ విస్తృత స్థాయిలో ప్ర‌చారంలోకి వ‌చ్చే అవ‌కాశాల్నీ కొట్టి పారేయ‌లేం.


మ‌రోప‌క్క బీజేపీ బ‌ల‌హీన ప‌డుతుంద‌న్న సూచ‌న‌లు క‌నిపిస్తే కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలు పుంజుకోవ‌చ్చు. ఎందుకంటే ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికీ ఆ పార్టీకి స్థిర‌మైన ఓటు బ్యాంకు ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. యూపీలో త‌న ప‌రిస్థితి మెరుగు ప‌ర‌చుకోవ‌డంతోపాటు త‌న‌కు బ‌ల‌మున్న రాష్ట్రాల్లో మ‌ళ్లీ స‌త్తా చాటుకోవ‌డం ద్వారా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి ఢిల్లీ రాజ‌కీయాల్లో మ‌రోసారి కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా మారొచ్చు. రాహుల్ లేదా ప్రియాంక గాంధీల నాయ‌క‌త్వానికి దేశ‌వ్యాప్తంగా సానుకూల ప‌రిస్థితులేర్ప‌డ‌వచ్చు. ఇత‌ర పార్టీలు మళ్లీ కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టేందుకు పోటీ ప‌డ‌వ‌చ్చు.

ఒక‌వేళ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఈసారి కూడా బీజేపీ త‌న‌ హ‌వా చాటుకోగ‌లిగితే మాత్రం ఇక మోదీషాల నాయ‌క‌త్వానికి స‌మీప భ‌విష్య‌త్తులో తిరుగులేద‌ని చెప్ప‌వ‌చ్చు. పంజాబ్, గోవా తదిత‌ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫ‌లితాలు సాధించ‌లేక‌పోతే మాత్రం ఆ పార్టీకి మ‌రింత గ‌డ్డు రోజులు ఎదుర‌య్యే అవ‌కాశ‌ముంది. జాతీయ రాజ‌కీయాల్లో ఆ పార్టీ ప్ర‌భావం మ‌రింత త‌గ్గిన‌ట్టేన‌ని భావించాలి. కాంగ్రెస్ ముక్త భార‌త్ నినాదాన్ని బీజేపీ మ‌రింత గ‌ట్టిగా వినిపించ‌వ‌చ్చు. ఇక ప్రాంతీయ పార్టీలు ప్ర‌ధానంగా ఏర్ప‌డే మూడో ఫ్రంట్ మాత్ర‌మే బీజేపీకి ప్ర‌త్యామ్నాయం కావ‌చ్చు. అయితే కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర ఫ్రంట్‌లు ఏవీ ఇప్ప‌టిదాకా పూర్తికాలం అధికారం నిలుపుకోలేక‌పోయిన నేప‌థ్యంలో ఈ ప‌రిస్థితి దేశ రాజ‌కీయాల‌కు ఏమంత క్షేమ‌దాయ‌కం కాద‌న్న‌ది గ‌త చ‌రిత్ర చెపుతున్న వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: