13 జిల్లాల్లో ప్ర‌కాశం జిల్లాలో మాత్ర‌మే టీడీపీ స్ట్రాంగ్‌... రీజ‌న్ ఇదే..!

VUYYURU SUBHASH
రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని, ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చాలా వ‌ర‌కు బ‌ల‌హీనంగా ఉంది. ఎక్క‌డిక‌క్క‌డ వైట్ ఎలిఫెంట్స్ పెరిగిపోయార‌ని.. వారి వ‌ల్ల యువ నాయ‌కులు ముందు కు కూడా రాలేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని.. వీరు ప్ర‌జ‌ల్లో బ‌లం కోల్పోయినా.. పార్టీని ప‌ట్టుకుని వేలాడుతున్నార‌ని.. యువ నాయ‌కులు ప‌దే ప‌దే ఆరోపిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ అధిష్టానం మాత్రం వీరి వాద‌న ల‌ను ప‌రిగణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. పైగా.. తాము చెప్పిందే వేదం అన్న‌ట్టుగా సీనియ‌ర్లు పెత్త‌నం చేస్తు న్నా.. చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డిపోయింది.

అయితే.. ఒక్క ప్ర‌కాశం జిల్లాలో మాత్రం ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నప్ప‌టికీ..  ఇక్క‌డ మాత్రం పార్టీ చాలా వ‌ర‌కు స్ట్రాంగ్‌గానే ఉంది. దీంతో ఇక్క‌డ పార్టీ భారీ ఎత్తున పుంజుకుంది. ముఖ్యంగా కీల‌క నాయ‌కులు.. అంద‌రూ కూడా యువ నేత‌లు కావ‌డం.. అంద‌రూ యాక్టివ్‌గా ఉండ‌డం.. పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌నే క‌సితో ప‌నిచేస్తుండ‌డం పార్టీకి క‌లిసివ‌స్తున్న అంశంగా మారింది. పైగా.. వీరంతా కూడా సీబీఎన్ ఆర్మీ త‌ర‌హాలో ఎప్పుడు ఏ ప‌ని అప్ప‌గించినా ముందుకు సాగు తున్నారు. అదేస‌మ‌యంలో ఎవ‌రు ఏ ప‌నిచెప్పినా.. దూసుకుపోతున్నారు.

ఫ‌లితంగా ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ జోరుగా ప‌నిచేస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. యువ నేత‌లుగా ఉన్న ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి, ఏలూరి సాంబ‌శివ‌రావు, డోలా బాల వీరాంజ‌నేయ స్వామి,  మాజీ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్‌, యువ నేత‌, కందుకూరుకు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ దామ‌చ‌ర్ల స‌త్య‌, ద‌ర్శి ఇంచార్జ్‌గా ఉన్న ప‌మిడి ర‌మేష్‌, ఎర్ర‌గొండ పాలెం నూత‌న ఇంచార్జ్ ఎరిక్ష‌న్ బాబు, సంత‌నూత‌ల‌పాడు ఇంచార్జ్ బీఆర్ విజ‌య్‌కుమార్‌.. ఇలా అంద‌రూ యువ నాయ‌కులే ఇక్క‌డ పార్టీ త‌ర‌ఫున చ‌క్రం తిప్పుతున్నారు. అంతేకాదు.. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తూర్పు ప్ర‌కాశంలో ఏలూరి సాంబ‌శివ‌రావు, గొట్టిపాటి ర‌వి క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళుతున్నారు. పార్టీని పార్ల‌మెంట‌రీ జిల్లాల వారీగా విడ‌దీసినా కూడా ఇక్క‌డ మాత్రం పాత జిల్లా యూనిట్‌గా క‌లిసి క‌ట్టుగా ముందుకు వెళుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా వీరు ప‌నిచేస్తున్నారు. ప్ర‌తి విష‌యంలో నూ నిశితంగా ఆలోచించ‌డంతోపాటు.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంలోనూ.. వారు ప‌నిచేస్తున్నారు. చాలా జిల్లాల్లో సొంత పార్టీ వోడు ప‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో ఎదుగుతున్నాడు అంటే పుల్ల‌లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ జిల్లాలో అలాంటి పుల్ల‌లు పెట్టే నేత‌లు పెద్ద‌గా లేరు.

ఇక పార్టీ అధినేత చంద్ర‌బాబు గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఇటీవ‌ల కాలంలో మ‌రింత తీవ్రంగా ప‌నిచేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని ముందుకు సాగుతున్నారు. ఎక్క‌డా వైట్ ఎలిఫెంట్స్ లేక‌పోవ‌డం.. యువ‌త‌ను వెన‌క్కిలాగే తంత్రాలు వేయ‌క‌పోవ‌డం వంటివి ఇక్క‌డ బాగా ప‌నిచేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇత‌ర జిల్లాలతో పోలిస్తే.. ప్ర‌కాశంలో పార్టీ దూకుడుగా ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: