
హరీశ్ రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. ఏమవుతుందో?
గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు.. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొంత మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని పోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డాడని లూద్రా వాదించారు. ఇంటిలిజెన్స్ అధికారులను ఉపయోగించుకొని చక్రధర్ గౌడ్ ఫోన్ టాపింగ్ చేయించడంతో పాటు.. ఆయన కదలికలను తెలుసుకొని ఇబ్బందులకు గురి చేశారని లూద్రా హైకోర్టుకు తెలిపారు.
పిటీషనర్ హరీష్ రావు తరపున దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష్య కారణంగానే పంజాగుట్ట పోలీసులు అక్రమ కేసు బనాయించారని ఆయన వాదించారు. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్‌కు నేర చరిత్ర ఉందని... అలాంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి దర్యాప్తు చేయకుండా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. చక్రధర్ గౌడ్ పై పలు కేసులున్నాయని.... ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసిన కేసులున్నాయన్నారు.
అక్రమంగా సంపాదించిన సొమ్ముతో రాజకీయంగా రాణించాలనుకున్నారని... ఇందులో భాగంగా బీజేపీలో చేరారని... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ టికెట్ రాకపోవడంతో బీఎస్పీలో చేరి సిద్దిపేట నుంచి పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కలేదని శేషాద్రి నాయుడు కోర్టుకు తెలిపారు. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరారు.
ఈ పిటీషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అప్పటి వరకు పొడిగించింది. ఇదే కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.