జగన్‌ను ఇరుకున పెట్టేందుకు మరో స్కామ్‌ దొరికిందిగా?

Chakravarthi Kalyan
ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వ వైఫల్యాలు, కుంభకోణాలు తాజాగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. కాంట్రాక్టుల ఉద్యోగుల నియామకాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డికి సంబంధించి మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆయన హయాంలో ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన రూ.151 కోట్లకు ఎలాంటి బిల్లులు కనిపించడం లేదు.

ఆ మొత్తాన్ని ఎందుకు చెల్లించారనే సమాచారమూ లేదు. దీంతో ఈ వ్యవహారంపై నిశితంగా పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా సంస్థ నుంచి ఒక్క రూపాయి చెల్లించాలన్నా.. నిర్ణీత విధానం ఉంటుంది. ఆ చెల్లింపు దస్త్రంపై సంబంధిత అధికారుల సంతకం చేయాలి. ఇవేమీ లేకుండానే సంస్థ మాజీ ఎండీ మధుసూదన్రెడ్డి వ్యవహరించినట్లు తెలిసింది.

జగన్ అండతో ఎండీ హోదాలో మధుసూదన్ రెడ్డి సొంత జాగీరులా సంస్థ ఆదాయానికి లెక్కాపత్రం లేకుండా పంచిపెట్టారు. అవసరానికి మించి నియామకాలు చేపట్టడమే కాకుండా.. బంధువులకు కీలక పోస్టులు, కాంట్రాక్టులు ఇచ్చారు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు సంస్థ పేరిట అప్పుల లెక్కా పత్రం కూడా లేకుండా పంచి పెట్టారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలకు ఆధారాలు లేకుండా చేసేందుకు కొందరు సిబ్బంది ప్రయత్నించారు. అప్రమత్తమైన ప్రభుత్వం గత నెల నాలుగో తేదీ నుంచి విజయావాడలోని ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేసింది. సిబ్బంది ఆన్ లైన్ విధానంలో పనిచేసేలా నిర్ణయం తీసుకుంది.

ఎన్నికలకు ముందు ఫైబర్ నెట్ రూ.900 కోట్లను రుణంగా తీసుకుంది. ఈ మొత్తం సంస్థ ఖాతాలో జమ కాగానే.. ఎడాపెడా చెల్లింపులు జరిగిపోయాయి. ఇందులో రూ.151 కోట్లకు లెక్కలు లేవు. ఏపీ ఫైబర్ నెట్ లావాదేవీలను ఇటీవల ఉన్నతాధికారులు పరిశీలించారు. కొన్ని చెల్లింపులకు ఎలాంటి వివరాలు లేవు. బ్యాంకు ఖాతాల ఆధారంగా లెక్కలు తేల్చడం అధికారులకు సాధ్యం కావడం లేదు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ ఆఫీస్ విధానాన్ని తొలగించి.. ఆఫ్ లైన్ కార్యకలాపాలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఇదంతా మందస్తు వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: