ఒక్క సినిమాతో లేడీ అమితాబ్ గా మారిన విజయశాంతి.. గుర్తింపుతో పాటు అవార్డ్స్ కూడా..!
•జాతీయ అవార్డుతో పాటు పలు ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా
•కర్తవ్యం సినిమాతో విజయశాంతికి లేడీ అమితాబ్ గా గుర్తింపు..
సాధారణంగా జీవిత కథలను తెరకెక్కించేటప్పుడు పూర్తి విషయాలు తెలుసుకొని సినిమా తెరకెక్కించాలి. అప్పుడే ఆ సినిమా రియలిస్టిక్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ చిత్రంలోని ఆ పాత్రలు పోషించేటప్పుడు నటీనటులు కూడా ఆ పాత్రలో జీవించాలి అంటే కచ్చితంగా ఆ పాత్ర గురించి పూర్తి విషయాలు తెలిసి ఉండాలి. అలా పూర్తిగా తెలుసుకొని సినిమా తెరకెక్కించి కేవలం రూ.90 లక్షల బడ్జెట్ తో ఆ కాలంలోనే రూ .7కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది విజయశాంతి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కర్తవ్యం చిత్రం అప్పట్లో ఏ రేంజిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పరుచూరి బ్రదర్స్ రాసిన ఈ చిత్రం పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ నిజ జీవిత ఆధారంగా రూపొందించబడి కమర్షియల్ విజయం సాధించింది. ఈ చిత్రంలో విజయశాంతి లీనమై నటించింది అని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు ఈ ఒక్క సినిమాతో ఆమె రూపురేఖలు కూడా మారిపోయాయి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి స్టార్ హీరోలకు చెమటలు పట్టించింది విజయశాంతి. అప్పటివరకు రొమాంటిక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఈ కర్తవ్యం సినిమాలో పవర్ఫుల్ పాత్రలతో మెప్పించి, కలెక్షన్లు రాబట్టి లేడీ అమితాబ్ గా పేరు సొంతం చేసుకుంది.
ముఖ్యంగా ఈ సినిమా రియలిస్టిక్ గా రావడానికి స్వయంగా కిరణ్ బేడీ ని కలిసి మరీ పూర్తి వివరాలు తెలుసుకొని ఇందులో నటించింది విజయశాంతి. అలా నాడు అంత కష్టపడింది కాబట్టి ఈ సినిమా ఈమెకు మంచి గుర్తింపును అందివ్వడమే కాదు ఏకంగా జాతీయస్థాయి అవార్డును కూడా అందించింది.
ఈ సినిమాలో ఉత్తమ నటి కేటగిరిలో నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది విజయశాంతి. 1990లో విడుదలైన ఈ సినిమా ఇక్కడ సక్సెస్ సాధించడంతో పలు భాషలలో విడుదల చేసి అక్కడ కూడా విజయం అందుకున్నారు.
ఇక ఈ చిత్రానికి లభించిన అవార్డ్స్ విషయానికి వస్తే.. 1990లో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్నారు విజయశాంతి. ఆ తర్వాత అదే ఏడాది ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు . అంతేకాదు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు విజయశాంతి. ఇక ఈమెతో పాటు ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు డైరెక్టర్ ఏఎం రత్నం. అలాగే ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఇలా ఈ సినిమా విజయశాంతి కెరీర్ ను ఊహించని మలుపు తిప్పిందనడంలో సందేహం లేదు.