మోదీ.. పొత్తుతో బాబుపై కసి తీర్చుకుంటున్నారా?

Chakravarthi Kalyan
బొప్పూడి సభలో చంద్రబాబు, పవన్ లకు ప్రధాని మోదీ షాక్ ఇచ్చారా? వారు ఆశించిన స్థాయిలో మోదీ ప్రసంగించలేదా? జగన్ పై విరుచుకుపడతారని భావించారా? కానీ సున్నిత విమర్శలకే పరిమితం అయ్యారా? దీంతో ఆ ఇద్దరు నేతలు అనుకున్నట్లు జరగలేదా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో ఈ ప్రశ్నలపైనే చర్చ జరుగుతోంది. మూడు పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచార సభ గత ఆదివారం జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఎన్డేయేను ఆశీర్వదించాలని మాత్రమే కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ సర్కారు పై రెండు విమర్శలకే పరిమితం అయ్యారు. దీంతో చంద్రబాబు తో పాటు పవన్ డీలా పడినట్లు కనిపిస్తోంది. ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రభుత్వాన్ని.. సీఎం లను తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తుంటారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరన్ విజయ్ వంటి వారిపై ప్రధాని విరుచుకుపడటం మనం చూశాం. వారి వైఫల్యాలను ఎండగడతారు. గంట ప్రసంగిస్తే దాదాపు అర గంట వారిని విమర్శించడానికే కేటాయిస్తారు. కానీ నిన్నటి సభలో ఆ స్థాయిలో జగన్ పై విరుచుకుపడలేదు. విమర్శలు చేయలేదు. కేవలం మంత్రుల అవినీతి లో పోటీ పడుతున్నారంటూ మాత్రమే వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదని ఆ రెండు పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇదే సందర్భంలో రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు ఇచ్చినట్లు చెప్పుకున్నారు. అంతకు మించి జగన్ సర్కారుపై ఎటువంటి విమర్శలు చేయలేదు. వాస్తవానికి జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తారని అటు పవన్, ఇటు చంద్రబాబులు భావించారు. జగన్ అవినీతి, అక్రమాలు, కేసులు తదితర విషయాలపై మాట్లాడతారని ఊహించారు. కానీ ఇవేమీ జరగలేదు. ప్రధాని పరిమిత వ్యాఖ్యలకు పరిమితం కావడంతో వారిలో నిరాశ అలముకున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: