ఈ జగన్‌ వరాలతో.. ఉద్యోగులు శాంతిస్తారా?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికల వేళ ఉద్యోగుల్లో అసంతృప్తిని తొలగించేందుకు పలు ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ సర్కారు… ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పటి నుంచో ఉద్యోగులు కోరుతున్న ఓ అంశంపై స్పందించి ఎన్నికల నేపథ్యంలో భారీ ఊరట కల్పించింది. దీంతో ఉద్యోగుల డిమాండ్లలో మరొకటి నెరవేరినట్లయింది. దీంతో ఆయా ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

టౌన్ ప్లానింగ్ ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శాఖలో పనిచేస్తున్న ఏడీలను డీడీలుగా నియమించేందుకు అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి గతంలో రెండేళ్లు కచ్చితంగా ఉండాలన్న నిబంధనను కూడా తొలగించారు. అంటే ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాటు మరో కీలక నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై పలు సందర్భాల్లో ఏసీబీ, విజిలెన్స్ సహా పలు ఇతర దర్యాప్తు సంస్థలు అవినీతి కేసులు నమోదు చేస్తున్నాయి.

లంచాలు తీసుకుంటూ పట్టుబడటం.. ఫిర్యాదులపై విచారణ సందర్భంగా ఆరోపణలు రుజువు కావడం జరిగినప్పుడు ఆయా ఉద్యోగులపై గరిష్ఠంగా రెండేళ్ల వరకు సస్పెన్షన్ విధిస్తున్నారు. దీంతో ఆయా కేసుల్లో చిక్కుకున్న ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఆ సస్పెన్షన్ ను తప్పించుకునేందుకు ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఇలా అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరంగా విధిస్తున్న రెండేళ్ల సస్పెన్షన్ ను  ఏడాదికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగులు గత ఐదేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా డీఏల పెండింగ్, ఇతర ప్రయోజనాలు కూడా సకాలంలో కల్పించకపోవడం, జీతాలు సకాలంలో చెల్లించకపోవడం వంటి పలు కారణాలతో ఉద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా పీఆర్సీ ఇచ్చే వరకు ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీరిని శాంతింపజేసేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయాలు తీసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: