గ్రేట్‌: పాక్ నావికులకు ప్రాణభిక్ష పెట్టిన ఇండియన్‌ నేవీ?

Chakravarthi Kalyan
భారత నేవీ మరోసారి దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేసింది. శత్రువైనా, మిత్రుడైనా ఆపదలో ఉన్నప్పుడు రక్షించాల్సిన ధర్మాన్ని నిర్వర్తించింది. సాహస విన్యాసాలు చేస్తూ వరుస పెట్టి అనేక మంది బందీలను కాపాడుతున్న భారత నేవీ..  సోమాలియా సముద్రపు దొంగల చేతికి చిక్కుకున్న 19మంది దాయాదీ దేశస్థులను చెర నుంచి విడిపించింది.  

అరేబియా సముద్రంలో 36 గంటల వ్యవధిలో భారత్ మరోసారి డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది పాకిస్థానీ నావికుల్ని రక్షించింది. యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్రను రంగంలోకి దింపి సముద్రపు దొంగల్ని తరిమికొట్టింది. ఈ మేరకు భారత నేవీ ప్రకటన విడుదల చేసింది.  సోమవారం  సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమీ ఫిషింగ్ నౌకను సాయుధ సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. 19మంది పాకిస్థానీ నావికుల్ని బంధించారు.

దీనిపై సమాచారం అందుకున్న భారత యుద్ధ నౌక ఓడను అడ్డగించి, బందీలను విడిపించింది. కొద్ది గంటల ముందు కూడా భారత్ ఇదే తరహా ఆపరేషన్ చేపట్టింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ చేపల బోటు ఇమాన్ ను సోమాలియా దొంగలు అపహరించారు. రక్షించమంటూ ఈ బోటు నుంచి ఆదివారం భారత్ నౌకాదళానికి అత్యవసర సందేశం అందింది. ఐఎన్ఎస్ సుమిత్ర, అడ్వాన్సుడ్‌ లైట్ హెలికాఫ్టర్ ధ్రువ్ రంగంలోకి దిగి 17 మంది మత్స్యకారులను రక్షించింది.

హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హౌతీ తిరుగుబాటు దారులు గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గల్ఫ్ ఆప్ ఎడెన్ లో ఆయిల్ ట్యాంకర్లతో వెళ్తున్న మార్లిన్ లాండ నౌకపై క్షిపణితో దాడి చేశారు. ఆ నౌక నుంచి వచ్చిన సందేశానికి స్పందించిన భారత నేవీ సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం ను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది. ఈ దఫా పాక్  నావీను కాపాడి సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: