రాష్ట్రంలో రోజుకొక దారుణం చూడాల్సి వస్తుంది. ఇప్పటికే పని మీద బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా నమ్మకం ఉండడం లేదు. రోజుకో ప్రమాదం జరుగుతుంది. బస్సులు మంటల్లో కాలిపోతున్నాయి. ఎంతోమంది సజీవ దహనం అవుతున్నారు.అయితే ఈ మధ్యన ఇలాంటి ఘటనలు ఎన్నో చూసాం.. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా కాకినాడ జిల్లాలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా 18 మంది సజీవ దహనమయ్యారు. మరి ఇంతకీ ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది..ఎలా జరిగింది? ఎంత మంది చనిపోయారు.. అనే వివరాలు తెలుసుకుందాం.. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలో బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. సామర్లకోట మండలం లోని వేట్లపాలెం పరిధిలో గోదావరి కెనాల్ పక్కనే ఉన్న సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో 18 మంది సజీవ దహనమయ్యారు. అలాగే మరో 8 మంది కార్మికులు మంటల్లో చిక్కుకోగా.. వారిని బయటికి తీసుకువచ్చి అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నారు.ఆ ఎనిమిది మందికి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఇక బాణసంచాల తయారీ కేంద్రంలోని పేలుడు శబ్దాలు దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించాయని అక్కడే ఉన్న స్థానికులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ భారీ పేలుడు శబ్దానికి పక్క గ్రామంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ స్లాబ్ లో కూడా పగళ్ళు వచ్చాయి అంటే అక్కడ ప్రమాదం ఏ రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఫైర్ ఇంజన్ సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ బాణసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం పరిమితి కంటే మించి బాణసంచా తయారు చేయడమేనని అక్కడే ఉన్న స్థానికులు చెబుతున్నారు. మరి బాణసంచా పేలుడు పరిశ్రమలో పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం పరిమితికి మించి బాణసంచా తయారు చేయడమేనా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.