కూలర్ విషయంలో గొడవ.. మ్యారేజ్ క్యాన్సల్!

praveen

ఉత్తరప్రదేశ్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక వివాహ వేడుకలో ఎవరు కూలర్ దగ్గర కూర్చోవాలనే విషయంపై గొడవ జరిగింది. ఈ గొడవ చినికి చినికి గాలి వానయ్యింది. చివరికి తీవ్ర కోపానికి గురైన వధువు పెళ్లి రద్దు చేసుకుంది. ఈ సంఘటన బలియా జిల్లాలోని చిట్‌బరాగావ్ పోలీసు పరిధిలోని మజ్రా గ్రామంలో జరిగింది. వధువు, వరుడి కుటుంబాల మధ్య కూలర్ దగ్గర ఎవరు కూర్చోవాలనే విషయంపై వాగ్వాదం జరగడం, అది హింసాత్మకం మారడం చకచకా జరిగిపోయాయి. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఈ వివాహ రద్దును చాలా సిల్లీగా భావిస్తున్నారు.
వరుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు, వరుడు అంత పెద్ద త్యాగం చేస్తే బంధువులు కూలర్ విషయంపై గొడవ పెట్టుకొని అతడి పెళ్లి ని పటాకులు చేశారు. వరుడు పేరు హుకుంచంద్ర జైస్వాల్. "అంతా బాగానే జరుగుతున్న సమయంలో, వివాహ వేదిక వద్ద కూలర్ దగ్గర ఎవరు కూర్చోవాలనే విషయంపై వివాదం చెలరేగింది." అని సదరు వరుడు మీడియా ముందు వాపోయాడు.
మరో గదిలో ఎదురుచూస్తూ ఉన్న వధువు ఈ గొడవ గురించి తెలుసుకుని చాలా బాధపడింది. ఈ గొడవ అశుభం అని భావించి, పెళ్లి ముందుకు సాగకూడదని నిర్ణయించుకుంది. వరుడు, ఆమె కుటుంబం ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నించినప్పటికీ, వధువు తన నిర్ణయం మార్చుకోలేదు. ఈరోజే ఇలాంటి గొడవ జరిగిందంటే ఇంకా పెళ్లయ్యాక ఎన్ని అశుభాలు జరుగుతాయో ఏమో అని వధువు భయపడింది.
చివరికి, పెళ్లి అధికారికంగా రద్దు చేయబడింది. పోలీసులు శాంతి భంగం కలిగించినందుకు వధువు, వరుడు కుటుంబాలకు 151 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. యూపీలో ఇంతకుముందు మాంసాహారం పెట్టలేదని వరుడు కుటుంబ సభ్యులు వధువు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఆ పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. పవిత్రమైన ఈ శుభకార్యంలో చిన్న చిన్న వాటికే గొడవలు పెట్టుకోవడం  చూస్తుంటే వారికి కాస్త కూడా అర్థం చేసుకునే మనస్తత్వం లేదని స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: