ఆగి ఉన్న రైలును ఎక్కిన బాలుడు.. చివరికి ఏమైందంటే..?
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో మహ్మద్ దిషాన్ అనే 16 ఏళ్ల యువకుడికి సెల్ఫీలంటే పిచ్చి. సెల్ఫీల కోసం ఎంతటి సాహసానికైనా, రిస్కీ ఫీట్ కైనా వెనకాడడు. ఆ గుణమే ఇప్పుడు అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. మంగళూరులో ఆగి ఉన్న ఓ గూడ్సు రైలు మీదకు ఎక్కి సెల్ఫీల కోసం దిషాన్ ప్రయత్నించాడు. అలా ప్రయత్నించిన సమయంలోనే పైన ఉన్న హైఓల్టేజ్ కరెంట్ తీగలు అతడికి తాకాయి. దాదాపు 25వేల వోల్టుల విద్యుత్ అతడి ఒంటి నుంచి ప్రవహించింది. ఫలితంగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే రైల్వే సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఇక తీవ్ర గాయాలతో కొట్టిమిట్టాడుతున్న అతడికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో ఘటనలో ముగ్గురు కుర్రాళ్లు సెల్ఫీల కోసం ప్రయత్నిస్తూ గత వారం ప్రమాదానికి గురయ్యారు. ఆ ముగ్గురు కుర్రాళ్లు బైక్ పై వెళ్తూ.. ఓ వ్యక్తి బైక్ ను నడుపుతుండగా మరో ఇద్దరుకుర్రాళ్లు ఆ బైక్ పై నిలుచుని సెల్ఫీ కోసం ప్రయత్నించారు. బైక్ అదుపుతప్పడంతో ఆ ముగ్గురు కుర్రాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సెల్ఫీల మోజుతో యువత పెడదోవ పడుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.