హౌసింగ్ ప్రాజెక్టులపై షాకింగ్ సర్వే..అర్థాంతరంగా ఆగిన కట్టడాలు

Suma Kallamadi
హౌసింగ్ ప్రాజెక్టులపై షాకింగ్ సర్వే ఓ విషయాన్ని బయటపెట్టింది. దేశంలోని 42 ప్రధాన నగరాల్లో హౌస్ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. 42 నగరాల్లో 1981 ప్రాజెక్టులు ఆగినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది. డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా ప్రకారంగా సుమారుగా 5.08 లక్షల ఇంటి నిర్మాణాలను అర్థాంతరంగా ఇపేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో హైదరాబాద్ మహానగరం కూడా ఉంది. భాగ్యనగరంలోని 25 హౌసింగ్ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయినట్లుగా సర్వే చెబుతోంది. ప్రాజెక్ట్ పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులో పడ్డారు.
ప్రాజెక్టు డెవలపర్ల ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, ప్రాజెక్టును ముందుకు సాగించే సామర్థ్యాలు లేకపోవడమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఆగిన ప్రాజెక్టుల్లో 1636 ప్రాజెక్టులు 14 టాప్ నగరాల్లో ఉంటాయని సర్వే చెబుతోంది. 4.31 లక్షల ఇళ్లు లేదంటే ప్లాట్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 345 ప్రాజెక్టుల్లో 76 వేలకుపైగా యూనిట్లు 28 సెకండ్ క్లాస్ నగరాల్లో ఉన్నాయి. వినియోగదారుల నుంచి సేకరించిన డబ్బులను అధిక లాభాల కోసం వేరే భూములను కొనుగోలు చేసేందుకు వాడుతుంటారు. దీనివల్లే చాలా వరకూ ప్రాజెక్టులు ఆగిపోయాయి. నిధుల్ని దారి మళ్లించడంతో పాటుగా రుణాల్ని చెల్లించే విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. అందుకే చాలా ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని సర్వే చెబుతోంది.
ఇళ్లను కొనుగోలు చేసేటప్పుడు డెవలపర్ల గురించి ఆరా తీయాలి. డెవలపర్ల సామర్థ్యాన్ని అంచనా వేసి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు నిలిచిపోగా అందులో ముంబయి నగరం కూడా ఉంది. ముంబైలో 234 ప్రాజెక్టులు ఆగిపోయాయి. బెంగళూరులో అయితే 225 ప్రాజెక్టులు ఆగిపోయాయి. థానేలో 186, పూణెలో 172, నవీ ముంబయిలో 125, నొయిడాలో 103, చెన్నైలో 92, కోల్‌కతాలో 82 ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో 25 ప్రాజెక్టులు ఆగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: