వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ బాధలు తీరినట్లే..!

Podili Ravindranath
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు. అసలు యావత్‌ ప్రపంచం మొత్తం కూడా కనిపించని శత్రువుతో మూడో ప్రపంచ యుద్ధం చేసింది. గతేడాది మార్చి నెలలో మొదలైన ఈ మహమ్మారి విస్తరణ... ఇప్పటికే అందరినీ తీవ్రంగా భయపెడుతోంది. మన పక్కన ఎవరైనా దగ్గినా, తుమ్మినా కూడా భయపడే పరిస్థితి. బాబోయ్ వైరస్ అన్నట్లుగా ప్రపంచానికి వణుకు పుట్టించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యావత్ ప్రపంచం కూడా లాక్‌ డౌన్‌ విధించింది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని క్రమంగా అన్‌లాక్‌ ప్రక్రియను దేశం అమలు చేస్తోంది. అయినా సరే... కొన్ని వ్యవస్థలైతే ఇప్పటికీ పూర్తిస్థాయిలో పని చేసేందుకు భయపడుతున్నాయి.
అయితే ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే దేశంలో 60 కోట్ల మంది వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు. అటు కొవిడ్ కేసులు కూడా క్రమంగా  తగ్గుతున్నాయి. ఇక ప్రభుత్వం కూడా అన్ని వ్యవస్థలకు అనుమతులు ఇచ్చేసింది. గత నెల 16వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు కూడా తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఆదేశిస్తున్నాయి. లాక్‌డౌన్‌ మొదలు పెట్టిన నాటి నుంచి పూర్తిస్థాయి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని ఐటీ సంస్థలు అనుసరిస్తున్నాయి. ఉద్యోగులందరినీ ఇంటి నుంచే పని చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. అందుకు అవసరమైన మౌలిక వసతులు కూడా కల్పించాయి కొన్ని సంస్థలు. అయితే కొవిడ్ కేసులు తగ్గడంతో... క్రమంగా ఆఫీసుల తాళాలు తెరుచుకుంటున్నాయి.
ఇందులో భాగంగా ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విప్రో.. తమ ఉద్యోగుల కోసం ఈ రోజు నుంచి తాళాలు తెరిచేసింది. రెండు డోసులు పూర్తైన ఉద్యోగులు ఈ రోజు నుంచి ఆఫీసుకు రావచ్చని సూచించింది. ఇందుకోసం హైబ్రిడ్ మోడల్ వర్క్‌ విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుతానికి వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఆఫీస్‌ నుంచి పని చేయాలని సూచించింది. ఇదే విషయాన్ని సంస్థ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌ జీ ట్వీట్‌్ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... పని చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రొటోకాల్స్‌ను ప్రకటించారు. ఈ ఏడాది జులై నాటికే విప్రో ఉద్యోగుల్లో 55 శాతం మంది పైగా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నట్లు కూడా ప్రేమ్‌ జీ ప్రకటించారు. హైబ్రిడ్ మోడల్ వర్క్ విధానం వల్ల ఉద్యోగులు అవసరమైనప్పుడు ఆఫీస్‌ నుంచి లేదా ఇంటినుంచి పని చేసుకోవచ్చని కూడా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: