ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ ను మార్చుకోవడం ఎలా అంటే...?
దేశంలో నివశించే వారికి ఆధార్ కార్డు వలన కలిగే ప్రయోజనాలను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందటంలో ఆధార్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. అధిక విలువ కలిగిన లావాదేవీలు జరపటానికి, ఐటీఆర్ దాఖలు చేయటానికి, గుర్తింపు కార్డుగా కూడా ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు ఉన్నవారు ఆధార్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
కానీ కొంతమంది ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా నమోదు కావటం వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆధార్ కార్డు వివరాల్లో ఎన్‌రోల్‌మెంట్ సమయంలోనే కొందరి వివరాలు తప్పుగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఆధార్ కేంద్రానికి వెళ్లటం ద్వారా మరియు ఆన్ లైన్ ప్రాసెస్ ద్వారా ఆధార్ కార్డులోని వివరాలను అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పుట్టిన తేదీ, జెండర్, పేరు లాంటి వివరాలను ఆధార్ కార్డులో ఎక్కువసార్లు మార్చుకోవటం కుదరదు.
ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే పేరు, జెండర్, పుట్టినతేదీ వివరాలను మార్చుకునే వీలు ఉంటుంది. కొన్ని వివరాలను ఆధార్ కార్డులో ఎన్నిసార్లైనా మార్చుకునే వీలు ఉంటుంది. నిర్దేశిత చార్జీలను చెల్లించి ఆధార్ కార్డులోని వివరాలను మార్చుకోవచ్చు. మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకు ఖచ్చితంగా రిజిష్టర్ అయి ఉంటే మంచిది. మొబైల్ నంబర్ లింక్ అయితే మాత్రమే ఓటీపీ ద్వారా ఆధార్ కార్డులోని వివరాలను మార్చుకునే అవకాశం ఉంటుంది.
మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే ఆధార్ కేంద్రానికి వెళితే మాత్రమే అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్ డేట్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి ఆధార్ సెంటర్ లో అందించాలి. మొబైల్ నంబర్ అప్ డేట్ కావడానికి 7 నుండి పది రోజుల సమయం పడుతుంది. మొబైల్ నంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఆధార్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్ క్లిక్ చేసి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.