అధికారం చేపట్టక ముందే ఆ దేశాలను వణికిస్తున్న ట్రంప్?
ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరటం.. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఘన విజయాన్ని సాధించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరికొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో.. అమెరికా ప్రయోజనాలకు దెబ్బ తగిలే అంశాలపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా చెప్పాలి. ఈ వాదనకు బలం చేకూరే పరిణామం తాజాగా చోటు చేసుకుంది.
అక్టోబరులో నిర్వహించిన బ్రిక్స్ సమావేశంలో.. అందులోని పది సభ్య దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించే అంశం చర్చకు రావటం తెలిసిందే. ఈ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ నోటినుంచి రావటం తెలిసిందే. తాజాగా దీనిపై ట్రంప్ స్పందించారు. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై వంద శాతం సుంకం విధిస్తామన్న వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.
బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్ కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయని.. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించకూడదన్నారు. శక్తివంతమైన అమెరికా డాలర్ కు బదులు మరో కరెన్సీని తీసుకురాకూడదని.. ఒకవేళ అలా చేసతే ఆయా దేశాల దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని తీసుకొస్తే.. ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాలసి వస్తుందన్న హెచ్చరికను చేశారు ట్రంప్.
ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ఏ రీతిలో రియాక్టు అవుతాయి? అన్నది ప్రశ్నగా మారింది. రష్యా లోని కజాన్ వేదికగా అక్టోబరులో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఉమ్మడి కరెన్సీ ఉండాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ట్రంప్.. తాజా వార్నింగ్ ఇచ్చారు.