ఇది పరీక్షల సమయం. ఇప్పుడు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ పత్రికల్లో వస్తున్నాయి. అందుకే ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక సూచన చేసింది. ఏటా ఇంటర్ పరీక్షల పరీక్షలు, ఫలితాల అనంతరం పలువురు విద్యార్థులు ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరమైన విద్యార్థులు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అందిస్తున్న టెలీ మానస్ సేవలను వినియోగించుకోవాలని కోరింది.
మానసిక సమస్యలతో బాధ పడుతున్న వారికి టెలీ మెంటల్ హెల్త్ సేవలను టెలి మానస్ ద్వారా వైద్యఆరోగ్య శాఖ అందిస్తోంది. ఒత్తిడికి లోనవుతున్నామని భావించిన విద్యార్థులు టెలీ మానస్ ద్వారా సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ సేవలను పొందవచ్చని ఇంటర్ బోర్డు సూచించింది. 14416 లేదా1800914416 నెంబర్ లకు కాల్ చేసి ఉచితంగా కౌన్సిలింగ్, గైడెన్సు పొందవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.