రాజకీయాల్లో ఎదుటి పార్టీ వాళ్లకు సవాళ్లు విసరడం మామూలే.. కానీ.. సొంత పార్టీ వాళ్లకు సైతం ఒక్కోసారి గట్టి హెచ్చరికలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అదే చేస్తున్నారు. పార్టీలోనే కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారంటున్న జనసేనాని.. అలాంటి వాళ్లను సహించబోనని వార్నింగ్ ఇచ్చారు. పార్టీలోని ఒకరిద్దరిలో కోవర్టు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పవన్ అనుమానిస్తున్నారు. వాళ్లు తనను వెనక్కిలాగే ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ.. జనసేనలో ఉంటూ పక్కవాడికి సహకరించే పరిస్థితి ఉండకూడదని పవన్ అన్నారు.
అందుకే ఇష్టం లేని వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ పార్టీలోనే ఉంటూ ఏ ఒక్క తప్పు చేసినా తప్పకుండా చర్య తీసుకుంటామన్నారు. వచ్చే నెల నుంచి పార్టీ నిర్మాణ లోపాలు సరిదిద్దుకుంటామన్నారు. త్వరలో తాను అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని.. ఇకపై ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని పవన్ స్పష్టం చేశారు.