తమిళనాడులోని కున్నూరు వద్ద చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం విధితమే. అందులో ముఖ్యంగా సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మిగతా 11 మంది ఆర్మీ అధికారులు, సిబ్బంది ఉన్నారు. వెల్లింగ్టన్ గ్రౌండ్స్ లో బిపిన్ రావత్ దంపతుల పార్థివ దేహాలతో పాటు మిగతా 11 మంది పార్థివదేహాలు కొద్దిసేపు అక్కడ ఉంచారు. ఆ తరువాత హెలికాప్టర్ ప్రమాదంలో భౌతిక కాయాలను సుల్లూరు ఎయిర్ బేస్‌కు తరలించారు. వెల్లింగ్టన్ ఎయిర్‌బేస్ నుంచి సుల్లూరు ఏయిర్ బేస్ వరకు భౌతిక కాయాలు చేరేందుకు దాదాపు 3 గంటల సమయం పట్టనుంది. పార్థివ దేహాలను తరలించే ముందు తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లింగ్టన్ ఎయిర్ బేస్‌కు చేరుకుని ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అదేవిధంగా సీఎం స్టాలిన్ హెలికాప్టర్ ప్రమాదంజరిగిన ఘటన వద్దకు వెళ్లారు.
బిపిన్ రావత్, మధులిక రావత్ భౌతిక కాయాలను ఓ వాహనంలో.. మిగతా 11 మంది భౌతిక కాయాలను మరొక వాహనంలో తీసుకెళ్లారు. 13 మంది పార్థివ దేహాలను రోడ్డు మార్గంలో సుల్లూరు ఎయిర్‌బేస్‌కు చేరేందుకు తరలించారు. మరోవైపు సుల్లూరు ఎయిర్ బేస్ ప్రాంతంలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తున్నదని సమాచారం. వర్షం తగ్గిన తరువాత సుల్లూరు ఎయిర్ బేస్ నుంచి భౌతికకాయాలను ఢిల్లీకి తరలించనున్నారు. ఘటన స్థలంలో 30 మీటర్ల దూరంలో లభ్యమైన బ్లాక్ బాక్స్ ద్వారా హెలికాప్టర్ ప్రమాదం పై ఓ క్లారిటీ రానున్నది.