విమాన ప్రయాణికులకు శుభవార్త... బుకింగ్స్ మొదలుపెట్టిన విమానయాన సంస్థలు...?
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో విమానయాన సేవలు స్తంభించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. అయితే దేశీయ విమానయాన సంస్థలు మాత్రం జూన్ నెల మొదటి వారం నుంచి తమ సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అతి త్వరలో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
గోఎయిర్, స్పైస్‌జెట్ లాంటి సంస్థలు ఈ నెల 16వ తేదీ నుంచే విమానాలను నడిపేందుకు సిద్ధం కాగా ఇండిగోమ్ ఎయిర్ ఏషియా, విస్తారా మాత్రం జూన్ మొదటి వారం నుంచి విమానాల రాకపోకలను పునః ప్రారంభించనున్నాయి. ఎయిర్ ఇండియా మినహా మిగిలిన దేశీయ విమానయాన సంస్థలన్నీ బుకింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. పౌరవిమానయాన శాఖ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ జూన్ మొదటి వారం నుంచి దేశీయ విమానయాన సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
అంతర్జాతీయ విమానయాన సేవల గురించి స్పష్టత రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.