పీరియడ్స్ గురించి మహిళలు తెలుసుకోవాల్సిన 5 అపోహలు...

Suma Kallamadi
మహిళల్లో ప్రతినెల వచ్చే పీరియడ్స్ విషయంలో అనేక అపోహలు, మూఢనమ్మకాలు ఉంటాయి. వాటి గురించి బాహాటంగా మాట్లాడకపోవడం వల్లే ఏవి నిజాలు ఏవి అపోహలో ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఐతే పీరియడ్స్ గురించి అవగాహన పెంచేందుకు మే 28వ తేదీని ఋతుస్రావం పరిశుభ్రత రోజుగా ప్రకటించారు. కాగా, ఈ సందర్భంగా ఈ ఆర్టికల్ ద్వారా బాగా ప్రాచుర్యంలో ఉన్న ఐదు అపోహల గురించి తెలుసుకుందాం.

అపోహ 1: మెన్‌స్ట్రువల్ సైకిల్ తేదీ స్థిరంగా ఉంటుంది.


నిజం: మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది ఒక పీరియడ్స్ యొక్క మొదటి దశ నుంచి చివరి దశ వరకు జరిగే ఒక సైకిల్. ఐతే మహిళలలో మెన్‌స్ట్రువల్ సైకిల్ సగటు గడువు 28 రోజులుగా ఉంటుంది. కానీ అందరు మహిళల్లో రుతుస్రావం 28 రోజులకు వస్తుందని భావించకూడదు. పీరియడ్స్ అనేది మహిళల ఏజ్, ఆరోగ్యాన్ని బట్టి వస్తుంది. కొందరిలో చాలా తక్కువ సమయంలో రావచ్చు.. అలాగే మరికొందరిలో ఆలస్యంగా కూడా రావచ్చు. మహిళల్లో మెన్‌స్ట్రువల్ సైకిల్ 21 రోజులు ఉండొచ్చు లేదా 35 రోజుల అయిన ఉండొచ్చు. ఈ రెండు సైకిల్స్ లను సరాసరి చేస్తే మనకు 28 రోజులు వస్తుంది కాబట్టి సగటు మెన్‌స్ట్రువల్ సైకిల్ గడువును 28 రోజులుగా చెబుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేసినా, బరువు తగ్గినా/పెరిగినా, మందులు వాడుతున్నా.. మహిళల్లోని మెన్‌స్ట్రువల్ సైకిల్ గడువు మారే అవకాశం ఉంది. అందరి ఆడవారిలో మెన్‌స్ట్రువల్ సైకిల్ గడువు స్థిరంగా ఉంటుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. మెన్‌స్ట్రువల్ సైకిల్ గడువు ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా అనారోగ్యంగా భావించకూడదు.


అపోహ 2: రుతుస్రావం సమయంలో మహిళలు నొప్పి గురించి చాలా ఎక్కువచేసి చెబుతుంటారు.


నిజం: నెలసరి సమయంలో మహిళలకు భరించలేనంత నొప్పి పుడుతుంది. కొందరికి రుతుస్రావం సమయంలో నొప్పిగానీ, ఇబ్బందులు గానీ రాకపోవచ్చు కానీ చాలా మంది మాత్రం తమ కాలేజీ, ఆఫీసుల నుంచి తప్పకుండా సెలవు తీసుకోవాల్సి పరిస్థితి వస్తుంది. రుతుక్రమం మొదలయ్యాక సుమారు ఎనభై శాతం ఆడవారిలో భరించలేని పొత్తికడుపు నొప్పి (డిస్మెనోరియా) వస్తుంది. అలాగే మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.  చికాకుగా ఉండటం, పని మీద ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి సమస్యలు పట్టి పీడిస్తాయి. అందువల్ల మహిళలు నెలసరి సమయంలో అనుభవించే నొప్పి నిజంగా నిజం.


అపోహ 3: మహిళల్లో కోపాన్ని, చిరాకును చూసి పీరియడ్స్ మొదలయ్యాయా అని అడగటం, నవ్వటం అనేది పూర్తిగా సమ్మతమే.


నిజం: పీరియడ్స్ మొదలయ్యాక మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోన్ల స్థాయి గణనీయంగా పడిపోతుంది. ప్రొజెస్టిరాన్ మాత్రం బాగా పెరుగుతుంది. ఈస్ట్రోజన్ అనేది సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ కి అనుసంధానమై ఉంటుంది. ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల సహజంగానే హ్యాపీ ఫీలింగ్స్ తగ్గిపోతాయి. మరోవైపు ప్రొజెస్టిరాన్ హార్మోన్ దూకుడుతనానికి, కోపానికి, వ్యాకులతకి, డిప్రెషన్ కి కారణమవుతుంది. నెలసరి సమయంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ శరీరంలో పెరిగి పోవడం వల్ల మహిళలకు స్వయంచలితంగానే కోపం అనేది వస్తుంది. దీని గురించి చులకనగా మాట్లాడటం.. నవ్వటం అనేది అంగీకరించదగినది కాదు.


అపోహ 4: రుతుస్రావం మొదలైతే.. చెడ్డ/ముఱికియైన/ మైల( రక్తం) వస్తుంది.


నిజం: అండాశయాలు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లను విడుదల చేయడానికి శరీరానికి రసాయన సందేశాలను పంపుతాయి. దీనివల్ల గర్భాశయం యొక్క పొర ఏర్పడుతుంది. ఫలదీకరణ అండాన్ని కనెక్ట్ చేయడానికి లోపల ఒక పొర సిద్ధంగా ఉంది. ఫలదీకరణ అండం లేనప్పుడు, పొర విచ్ఛిన్నమై రక్తస్రావం అవుతుంది. ఇదంతా కూడా పిల్లలకు జన్మనివ్వడానికి జరిగే ఒక ప్రక్రియ. సో, రుతుస్రావాన్ని మలినమైన రక్తంగా భావించకూడదు.


అపోహ 5: నెలసరి సమయంలో పూజ గది లోకి రాకూడదు, పూజా సామాగ్రి ముట్టుకోకూడదు.


నిజం: పూర్వ కాలంలో మహిళలకు సానిటరీ ప్యాడ్స్ వంటివి అందుబాటులో లేకపోవడం వల్ల కాస్త అపరిశుభ్రంగా ఉండేవారు. దీనివల్ల పూర్వీకులు మహిళల చేత వంట చేయించే వారు కాదు. కానీ ఇప్పుడు మహిళలు నెలసరి సమయంలో అన్నీ వాడితూ చాలా పరిశుభ్రంగా ఉంటున్నారు. దీనివల్ల పాతకాలం నాటి విశ్వాసాలను ఎంత త్వరగా వీడితే అంత మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: