మన తెలుగమ్మాయికి ఏఆర్ రెహమాన్ నుంచి ఫోన్.. వెంటనే వెళ్లగా..

P.Phanindra
మనసుకు హాయిగా ఉండే సంగీతం వింటుంటే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. అంత శక్తి సంగీతానికి ఉంది. అయితే సంగీతంలో కెరీర్ కొనసాగించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒక సింగర్ కావాలంటే ఎంతో ప్రతిభతో పాటు వైవిధ్యమైన గానం మన సొంతం కావాలి. అలా విభిన్నమైన టాలెంట్‌తో మొదటి పాటే ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన సినిమాలో పాడారు మన తెలుగమ్మాయి మధుర ధార. మధుర ధారకు అసలు మొదటిపాటే ఏఆర్ రెహమాన్ కంపోజిషన్‌లో పాడే అవకాశం ఎలా వచ్చిందంటే.. మధుర ధార ఐదు వారాల సమ్మర్ ప్రోగ్రాం కోసం 2018లో అమెరికా వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఆమె ఏఆర్ రెహమాన్‌ను కలుసుకున్నారు.
ఏఆర్ రెహమాన్ సమక్షంలో పాటలు పాడిన వారిలో ఆమె కూడా ఒకరు. ఆ తరువాత అంతా అయిపోయింది ఆమె ఇండియాకు తిరిగి వచ్చేసింది. అయితే అనుకోకుండా ఒకరోజు ఆమెకు ఏఆర్ రెహమాన్ స్టూడియో నుంచి పిలుపు వచ్చింది. అక్కడకు వెళ్లిన మధుర ఒక్కసారిగా షాకైంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న బిగిల్ చిత్రంలో ఒక పాట పాడాలంటూ ఏఆర్ రెహమాన్ ఆఫరిచ్చారు. అంతే.. మధుర ధార ఒక్కసారిగా ఇది నిజమేనా అని ఆశ్చర్యానికి లోనైంది. ఉనకాగ అనే ఆ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఇదే చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అవ్వగా.. తెలుగు వర్షన్ సాంగ్ నీతోనే అడుగు వేయనా పాటను కూడా ఆమెనే పాడింది. ఆ తరువాత కూడా ఆమె రెహమాన్‌తో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కాగా.. మధుర ధార స్వస్థలం రాజమండ్రి. ఇంటర్‌ తర్వాత 2016లో చెన్నైలోని కళాక్షేత్రలో ఆమె నాలుగేళ్ల కర్ణాటిక్‌ మ్యూజిక్‌ డిప్లొమా చేశారు. ఆమె తాతయ్య సి.ఆర్‌.జె పంతులు థియేటర్‌ ఆర్టిస్టు, ప్లే రైటర్‌ అవ్వడం విశేషం. థియేటర్‌ ఆర్టిస్టుగా ఆయన రెండుసార్లు నంది అవార్డు గెలుచుకున్నారు. కన్యాశుల్కంలో గిరీశం పాత్రకు ఆయనకు ఆ అవార్డులు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: