ఆడవాళ్ళ వక్షోజాల్లో ఏర్పడే సమస్యల గురించి తప్పక తెలుసుకోండి.. !

Suma Kallamadi

 కొంతమంది ఆడవాళ్ళలో వక్షోజాల్లో  (రొమ్ములు) ఒక్కోసారి నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలా నొప్పి వచ్చిన ప్రతిసారి ఆందోళన చెందుతూ ఉంటారు.అలాగే  అప్పుడప్పుడూ స్రావాలూ విడుదలవుతాయి,  తడుముతుంటే గడ్డల్లా తగులుతున్నాయి  అంటూ ఏదో జబ్బు వచ్చిందని భయపడుతుంటారు.అసలు వాటికీ గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. !! పుట్టినప్పట్నుంచే స్త్రీల వక్షోజాల్లో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి.  సాధారణంగా రొమ్ములో నొప్పీ, అసాధారణ స్రావాలూ, గడ్డలూ, ఆకృతిలో తేడాల వంటి సమస్యల్ని చాలామంది ఫేస్  చేస్తూనే ఉంటారు. పైగా అవి పుట్టిన పాపాయి దగ్గర్నుంచీ, రుతుక్రమం మొదలైనప్పుడూ, యౌవనంలో, గర్భిణిగా ఉన్నప్పుడూ, బిడ్డకు పాలిచ్చేప్పుడూ, నడివయసు నుంచి మెనోపాజ్‌ వరకూ ఇలా ఏ దశలోనయినా ఇబ్బందిపెట్టవచ్చు


అయితే ప్రతి స్త్రీకి ఏదో ఒక వయసులో ఈ బాధ ఉంటుంది. చాలామంది ఈ నొప్పి క్యాన్సర్‌కి సంకేతం అని భయపడతారు. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సైక్లికల్‌. అంటే రుతుచక్రంతో ప్రతినెలా వచ్చే నొప్పి. ఇది నెల మధ్యలో మొదలై నెలసరి సమయం వరకూ పెరుగుతూ ఉంటుంది. హార్మోన్లు ఎక్కువగా స్రవించడం వల్ల వక్షోజాల్లోని కణాల్లో స్రావాలు ఎక్కువై, ఈ నొప్పి అనేది వస్తుంది. వక్షోజాలు కాస్త గట్టిగా అనిపిస్తాయి.నొప్పి నివారణ మందులు, విటమిన్‌ ఇ, వక్షోజాలకు ఆసరా ఉండే లోదుస్తులు ధరిస్తే మంచిది అలాగే నెలసరికి కొన్ని రోజుల ముందు కాఫీలూ, టీలూ, శీతలపానీయాలూ, వేపుళ్లూ తగ్గించుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. కొన్నిసార్లు రుతుక్రమంతో సంబంధం లేకుండా కూడా నొప్పి ఉంటుంది. రొమ్ములో స్రావాలు నిలిచిపోయి, చిన్నచిన్న నీటి బుడగల్లా తయారైనా, లేదా రొమ్ములోని పాల నాళాల్లో స్రావాలు గట్టిపడినా నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిని ఫైబ్రోసిస్టిక్‌ డిసీజ్‌ అంటారు. అలాగే ఒక్కోసారి హార్మోన్ల ప్రభావం వల్ల చనుమొనల నుంచి నీరులాంటి స్రావం కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అది చిక్కగా, నెత్తురులా ఉండటం, బూడిద రంగులో, చీములా ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.


అలాగే కొంతమంది మహిళల వక్షోజాల్లో అదిమినప్పుడు గడ్డలు లాంటివి తగులుతున్నాయని భయపడిపోతారు. చాలామంది పాలగ్రంథినే గడ్డ అనుకుని కంగారుపడతారు.రొమ్మును పరీక్షించడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. రెండువేళ్ల మధ్య వక్షోజాలను పట్టుకుని చూస్తే గడ్డల్లానే ఉంటాయి. అలా కాకుండా అరచేత్తో తడిమి, పరీక్షించుకుంటే నిజంగానే గడ్డలు ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. కొన్నిసార్లు వక్షోజాల్లోని కొవ్వంతా గడ్డకట్టి కూడా గడ్డలా తయారవుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు కూడా గడ్డలా చేతికి తగులుతుంది. ఒకవేళ ఆ గడ్డ గట్టిగా రాయిలా వక్షోజం లోపల అతుక్కుని ఉంటే పైన చర్మం కూడా దానికి అతుక్కుపోయి, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావాలూ వస్తుంటే క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతినెలా నెలసరి అయిపోయిన వెంటనే వక్షోజాలను పరీక్షించి చూసుకోవాలి. ఏడాదికోసారి వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: