హెరాల్డ్ విజయం మీదే : పాజిటీవ్ ఆలోచనలతో ముందుకు సాగితే విజయం మీదే!

Edari Rama Krishna
సాధారణంగా మనలో చాలామంది తాము ఉన్నచోటునుంచి మరొక చోటుకు వెళ్లడానికి కాని, చేస్తున్న ఉద్యోగంనుంచి మరొక ఉద్యోగంలోకి మారడానికి కాని సాహసించరు. ఒకవేళ చేస్తున్న ఉద్యోగంలో బదిలీ అయినా వెళ్లడానికి ఇష్టపడరు. దీనికి కారణం ఇన్నాళ్లుగా అలవాటయిన ప్రదేశాన్ని, స్నేహితులను విడిచి కొత్త ఊళ్లో, ఎవరూ తెలియనిచోట మళ్లీ మొదట్నించి జీవితాన్ని ఆరంభించాల్సి వస్తుందనే భయం ప్రధాన కారణం.  జీవితంలో ఎప్పుడు ఎవరికీ సంతోషాలు మాత్రమే ఉండవు.. పేద అయినా ధనికుడైనా కష్టాలు సుఖాలు తప్పకుండా ఉంటాయి.  కష్టం వచ్చినపుడు కుంగిపోవడం.. సుఖం వచ్చినపుడు పొంగిపోవడం సామాన్యులకు సర్వసాధారం.  అయితే ఈ సమయంలోనే స్థిమితంగా ఉంటూ దేన్నైనా ఒకేలా భావించి ధైర్యంగా ఉండేవారు సంతోషంతో ముందుకు సాగుతారు. ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగపర చుకోలేకపోతే భవిష్యత్తులో మళ్లీ అటువంటి అవకాశం రాకపోవచ్చు.


 అందుకే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు వెంటనే దానిని అందిపుచ్చుకుని జీవితంలో పైకి ఎదగడానికి కృషి చేయాలి.ఏ పని చేయాలన్నా, ఒకవేళ ఆ పని మనకు ఇష్టం లేకపోతే, దానిని తప్పించుకోవడానికి అనేక మార్గాలను వెదుకుతాం. పైన మనం చెప్పుకున్నట్లు మరొక ఊరు వెళ్లాల్సి వస్తే, ఈ మాత్రం దానికి అంతదూరం వెళ్లడం అవసరమా? వాళ్లిచ్చే జీతానికి అంత పని చేయాలా? అంటూ రకరకాలుగా ప్రశ్నిస్తుంటాం.   కూపస్థ మండూకంలా ఉన్నచోటే ఉంటూ, అదే ప్రపంచమను కుంటూ ఆనందంగా గడపటానికి ప్రయత్నిస్తాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆనందంగా గడుపుతున్నట్లు నటిస్తాం. కొన్నిసార్లు ఎదుటి వారు ఏదైనా పని సరిగ్గా చేయలేనప్పుడు ‘ఆ పరిస్థితిలో కనుక నేనే ఉండి ఉంటేనా? అనో, ‘అసలు ఆ అవకాశం నాకు వచ్చి ఉంటేనా? అనో అంటూ మనమెంతో సమర్థులమైనట్లు మాట్లాడుతాం.


నిజంగా అలాంటి పరిస్థితి మనకు ఎదురైతే, తప్పించు కోవడానికి మార్గాలను అన్వేషిస్తాం. అందరూ ఇలాగే ఉంటారని కాదు. కాని, మనలో చాలామందిలో ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుంటుంది. సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోలేకపోవడం, దానినుంచి పారిపోవడానికి ప్రయత్నించడం సాధారణంగా కనిపించే అంశమే.  ఆత్మవిశ్వాసం ఉన్నవారికి విజయం సాధిస్తామనే నమ్మకం మెండుగా ఉంటుంది. ఆత్మన్యూనతాభావంతో బాధపడుతున్న వారు ఏ పని చేయడానికైనా జంకుతారు. వారిలో ఈ పని నేను చేయ లేనేమో అనే భావన అధికంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచనా ధోర ణిని మనం నెగటివ్‌ ఆలోచనా దృక్పథమని అంటాము. ఈ నెగటివ్‌ దృక్పథంనుంచి బైటపడితే తప్ప లక్ష్యసాధనవైపు అడుగులు వేయలేరు.  అవకాశాలు రావడం లేదని బాధపడటం తప్పు. అవకాశా లనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటిని మనకు అనువ్ఞగా మల చుకోలేకపోవడం మన తప్పు. ఏ పని చేయాలనుకున్నా, దానిని దిగ్విజయంగా చేయగలమనే ధీమా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: