పేరుకే అగ్రరాజ్యం.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడండి?

praveen
బెంగళూరుకు చెందిన యూట్యూబర్ ఇషాన్ శర్మ తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోని ఒక సిటీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ వీడియోలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని కొన్ని తీవ్రమైన సమస్యలను బయటపెట్టారు. నిజాయితీగా తన అభిప్రాయాలను తెలియజేస్తూ సోషల్ మీడియా యూజర్లకు దగ్గరైన ఇషాన్ ఈ వీడియోను X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నగరంలోని అనేకమంది ఇళ్లు లేని వారు, మానసిక సమస్యలు ఉన్న వ్యక్తులు, మత్తుపదార్థాలను వాడే వ్యక్తులు రోడ్లపై ఉన్న దృశ్యాలు చూపించారు. అంతేకాకుండా, అక్కడ గన్‌ వైలెన్స్, కార్లను చోరీ చేయడం, ఇతర దొంగతనాలు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో కూడా ఆయన వివరించారు.
ఇషాన్ శర్మ మాట్లాడుతూ, "శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా టెక్ క్యాపిటల్. ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యక్తులు, అతిపెద్ద టెక్ కంపెనీలకు నిలయం. కానీ, ఈ నగరం ఎందుకు ఇలా ఉంది? ఇక్కడ ఇంత గందరగోళం ఎందుకు? ఇలాంటి పరిస్థితులను ఎందుకు సరిచేయడం లేదు?" అని ప్రశ్నించారు.
ఇషాన్ శర్మ పోస్ట్ చేసిన వీడియో గురువారం రోజు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ వీడియోను 35,000 మందికి పైగా చూశారు. ఇన్నోవేషన్ హబ్‌గా పేరున్న శాన్ ఫ్రాన్సిస్కో నగరం ఇలాంటి పరిస్థితిలో ఎందుకు ఉంది అనే దానిపై నెటిజన్లు చర్చలు చేసుకుంటున్నారు. కొంతమంది నెటిజన్లు, "శాన్ ఫ్రాన్సిస్కో నగరం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇళ్లు లేని వారి సమస్య, మానసిక ఆరోగ్య సమస్యలు, భద్రతా సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకురావాలి, సమాజం సహకరించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి" అని అన్నారు.
మరికొందరు నెటిజన్లు, "చాలా మంది టెక్ కంపెనీలు ఆస్టిన్, టెక్సాస్‌కు మారడంతో శాన్ ఫ్రాన్సిస్కోలో కొన్ని ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. 2016 నుండి ప్రాపర్టీ విలువలు 90% వరకు తగ్గాయి" అని చెప్పారు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే, మరికొందరు ఎంతో అభివృద్ధి చెందిన నగరం అయినా సామాజిక సమస్యలు ఉండటం సహజమే అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: