అక్కడ గుట్టలుగా జిరాఫీల కళేబరాలు.. ఏం జరుగుతోంది..!

MOHAN BABU
కెన్యా దేశంలో కరువు రక్కసి కోరలు చాచింది. ఈ దుర్భిక్ష పరిస్థితులు మూగజీవుల పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా జిరాఫీల  మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జిరాఫీల మృతదేహాలు గుట్టలుగుట్టలుగా పడి ఉన్న హృదయవిదారక దృశ్యాలు అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇలాంటి దృశ్యాలకు సంబంధించిన ఒక ఫోటో ఆన్లైన్ లో వైరల్ అవుతుంది.ఇది వాజిర్ లోని సాబులి వైల్డ్ లైఫ్ కన్సర్వేన్సీ లో చాలా జిరాఫీలు చనిపోయి పడి ఉన్న దృశ్యం. ఆహారం, నీరు లేకపోవడంతో బలహీనంగా ఉన్న జిరాఫీలు మృత్యువాత పడ్డాయి. దాదాపు ఎండిపోయిన రిజర్వాయర్ వద్ద నీరు తాగడానికి ప్రయత్నించిన సమయంలో ప్రమాదవశాత్తు బురదలో కూరుకుపోయి చనిపోయినట్లు ఈ ఫోటోని బట్టి తెలుస్తోంది.

 ఇది అత్యంత హృదయవిదారకమైన పరిస్థితి అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ జజీరా కథనం ప్రకారం, సెప్టెంబర్ నుండి కెన్యా ఉత్తర భాగంలో 30 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.ఇది ఈ ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువుకు దారితీసింది. వర్షపాతం లేకపోవడం ఈ ప్రాంతంలోని వన్యప్రాణుల పై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. ఆహారం,నీటి కొరతను తీవ్రతరం చేసింది. కరువు కారణంగా వన్యప్రాణులు చాలా ప్రమాదంలో ఉన్నాయని బౌర్-అల్గి జిరాఫీ అభయారణ్యం సిబ్బంది  చెప్పారు. పెంపుడు జంతువులకు కాస్తోకూస్తో సహాయం అందుతుంది. కరువు నుంచి ప్రాణాలు కాపాడగలిగాయి.

కానీ వన్యప్రాణుల దుస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆయన చెప్పారు. నది వెంబడి వ్యవసాయ కార్యకలాపాలు కూడా జిరాఫీల మరణాలకు కారణమవుతున్నాయని ఆయన అన్నారు. జిరాఫీలకు నీరు అందకుండా వ్యవసాయ పనులు నిరోదిస్తున్నాయని, దీంతో పరిస్థితి మరింత దిగజారుతుందని తెలిపారు. కరువు కారణంగా సమీపంలోని గరిస్సా కౌంటీలో వేల జిరాఫీలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానిక మీడియా నివేదిక పేర్కొంది. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా సెప్టెంబర్లో కరవును జాతీయ విపత్తుగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: