మనుషులకు ఎగిరే కార్లలో తిరగాలనేది చిరకాల స్వప్నం. బామ్మ మాట బంగారు బాట సినిమాలో సూపర్ కార్ రోడ్డుపై ప్రయాణించడమే కాదు ఆకాశంలో ఎగురుతూ ఆశ్చర్యపరిచింది. అచ్చం అదే తరహాలో రియల్ కార్లు రియల్ లైఫ్ లో కూడా ఆకాశంలో విహరిస్తూ ఉంటే ఎంత బాగుండు అని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అటువంటి వ్యక్తుల డ్రీమ్స్ నిజం చేసేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలం నుంచి నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉన్నారు. అయితే ఎగిరే కార్లు తయారు చేయడం నిజంగా చాలా సవాళ్ళతో కూడుకున్నది. అయితే ఎంత కష్టమైనా సరే ప్రజల కోసం ఎగిరే కార్లను తయారు చేయాలన్న సంకల్పంతో గత రెండు సంవత్సరాలుగా పలు కంపెనీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు వినూత్న నమూనాలు తయారు చేసాయి. ఈ క్రమంలోనే ఎయిర్ కార్ అనే ఒక కంపెనీ ఒక ఎగిరే కారు ని తయారు చేసి విజయవంతంగా ఆకాశంలో టెస్ట్ ఫ్లైట్ పూర్తి చేసింది. విశేషమేమిటంటే ఒక ఫ్లయింగ్ కారు ఇంటర్సిటీ ఫ్లైట్/ట్రయల్ రన్ పూర్తి చేయడం ఇదే మొట్టమొదటిసారి. జూన్ 28వ తేదీన స్లొవేకియాలో నిత్రా విమానాశ్రయం లో టేకాఫ్ అయిన ఈ ఫ్లయింగ్ కారు సుమారు ఎనిమిది వేల అడుగుల ఎత్తుకు ఎగిరి 35 నిమిషాల పాటు గాలిలో ప్రయాణించి బ్రాటిస్లావా ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది.
అయితే ఈ సందర్భంగా ఎయిర్ కార్ కంపెనీ ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. ఒక్క క్లిక్ చేయగానే ల్యాండ్ అయిన ఫ్లయింగ్ కారు మూడు నిమిషాలలోపు స్పోర్ట్స్ కార్ గా మారిందని పేర్కొంది. ఈ ఫ్లయింగ్ కారు 160 హెచ్‌పి బిఎమ్‌డబ్ల్యూ ఇంజిన్‌తో వస్తుందని.. దీనికి ఫిక్స్‌డ్ ప్రొపెల్లర్, బాలిస్టిక్ పారాచూట్ కూడా ఫిక్స్ చేసామని తయారీదారులు వెల్లడించారు. ఈ కంపెనీ చెప్పిన ప్రకారం.. ఈ ఎగిరే కారు 8,200 అడుగుల ఎత్తులో 1,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇది 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
ఈ సూపర్ కార్ ఇప్పటికే 40 గంటల సమయం పాటు గాలిలో విహరించింది. ట్రయిల్ రన్ సమయంలో, ఈ ఎగిరే కారు నిటారుగా 45 డిగ్రీల టర్న్ తీసుకోగలదని తేలింది. స్థిరత్వాన్ని కూడా కలిగి ఉన్నప్పుడు ఈ పరీక్షలలో తేలింది. టేకాఫ్ చేసిన కారు విమానంలా మార్చడానికి 2 నిమిషాల 15 సెకన్ల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది.