పద్యం చెబితే.. పెట్రోల్ ఫ్రీ..

yekalavya
చెన్నై: ఒకపక్క పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సెంచరీ మార్క్ దాటేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి పెట్రోల్ భారంగా మారింది. అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ ఫ్రీగా ఇస్తానంటున్నాడు. లీటర్ వంద రూపాయల రేటుతో మండిపోతున్న పెట్రోల్‌ను ఫ్రీగా ఇచ్చేస్తానని చెబుతున్నాడు. అయితే దీనికి ఓ కండిషన్ పెట్టాడు. అదేంటంటే.. ఓ పద్యం చెప్పాలి. మీరు విన్నది నిజమే.. మాతృభాషలో ఓ పద్యం చెబితే పెట్రోల్ ఉచితంగా ఇస్తానని ప్రకటించారు.
ఆధునిక జీవనం తెచ్చిన మార్పులు కారణంగా నేటి తరం చిన్నారులు పద్యాలకు దూరమవుతున్నారనడంతో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ సాహిత్యాభిమాని పద్య సంపదను కొత్త తరానికి దగ్గర చేయాలని భావించాడు. అందులో భాగంగానే పెట్రోల్ కోసం వచ్చిన వారు తమ చిన్నారులను తీసుకు వచ్చి, వారి చేత పద్యాలు చెప్పించాలి. వారు పూర్తి పద్యాన్ని చెబితే.. ఉచితంగా పెట్రోల్ ఇస్తాడు. వారిలో సాహిత్యం పట్ల అభిమానం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతున్నారు. అయితే తమిళుల ఆరాధ్యుడు తిరువళ్లువర్ రచించిన తిరుక్కరళ్ గ్రంథంలోని పద్యాలను చెప్పిన వారికే ఈ ఆఫర్ అంటూ ఓ చిన్న మిలిక కూడా పెట్టాడు.
62 ఏళ్ల కే సెంగుట్టవన్‌కు తమిళ సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. అందులోనూ తమిళ సాహిత్యంలో అత్యంత ప్రధానమైన తిరువళ్లువర్ అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. ఆయన కుటుంబానికి కూడా తిరువళ్లువర్, ఆయన రచించిన తిరుక్కరళ్ అంటే మాటల్లో చెప్పలేనంత గౌరవాభిమానాలు. వళ్లువర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సెంగుట్టవన్.. కరూర్‌కు సమీపంలోని నాగంపల్లి ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ ఉంది. దీని పేరు కూడా వళ్లువర్ అని నామకరణం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
కాగా.. నేటి తరానికి ఈ సాహిత్యాన్ని దగ్గర చేసేందుకు పెట్రోల్ ధరలు పెరిగిన ప్రస్తుత తరుణమే సరైనదనే ఆలోచన ఆయన మదిలో మెదిలింది. ఫలితంగా పుట్టినదే ‘పద్యాలు చెబితే..పెట్రోల్ ఉచితం’ ఆఫర్. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైనా సరే తిరుక్కరళ్‌లో ఉన్న పద్యాల్లో కనీసం 20 చెబితే లీటర్, 10 చెబితే అర లీటర్ చొప్పున ఉచితంగా పెట్రోల్ పొందవచ్చంటూ ప్రకటన ఇచ్చారు.
ఇంకేముంది.. చూస్తుండగానే ఈ ప్రకటన విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు తిరుక్కరళ్ పద్యాలు నేర్పించి.. పెట్రోల్ బంక్‌కు తీసుకొస్తున్నారు. పిల్లల చేత పద్యాలు చెప్పించి.. పెట్రోల్ పట్టుకెళుతున్నారు. అయితే ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకూ మాత్రమే కొనసాగుతుందని చెబుతున్నారు. ఉచిత పెట్రోల్ విషయం అటుంచితే.. పిల్లల్లో సాహిత్యాభిరుచి పెంచేందుకు సెంగుట్టవన్ చేస్తున్న ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: