మానవాళికి ప్రాణాంతకంగా మారిన.. తెలంగాణ హరితహారం..!

Divya
ప్రకృతిలో లభించే ప్రతి మొక్క కూడా మానవాళికి ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా ఎన్నో రకాల వ్యాధులను కూడా దూరం చేస్తూ ఉంటుంది. అయితే ఈ మొక్కలు కేవలం మనిషికి మాత్రమే కాదు .. ఇటు పక్షులకు.. అటు జంతువులకు.. కూడా ఆహారం అవుతూ ఉంటాయి. అలాంటి మొక్కలు మన ఆరోగ్యాన్ని పెంచాలి కానీ తెలంగాణలో చేపట్టిన హరితహారం కారణంగా ఒక మొక్క ఇప్పుడు మానవాళికి ప్రాణాంతకంగా మారింది.. మొక్క కదా అని విదేశాల నుంచి తీసుకొచ్చి మన దేశంలో వీటిని నాటగా. మన దేశ వాతావరణ పరిస్థితులకు వ్యతిరేకంగా ఈ మొక్క మరింత హాని కలుగచేస్తోంది. ముఖ్యంగా ఈ మొక్కలపై పక్షులు వాలవు.. అలాగే జంతువులు, కీటకాలు కూడా ఈ మొక్కల దగ్గరకు దరిచేరవు .. అంతేకాదు ఈ చెట్టు నీడ పడిన చోట గడ్డి కూడా మొలవదు. దీన్ని బట్టి చూస్తే ఈ మొక్క ఎంత ప్రాణాంతకమో అర్థం చేసుకోవచ్చు.

ఈ మొక్క అసలు పేరు కోనో కార్పస్.. కంబ్రాటేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగించుకుంటుంది. అంతే కాదు భూమి లోపల వేర్లకు అడ్డొచ్చే డ్రైనేజీ వ్యవస్థ, పైప్ లైన్లను, విద్యుత్ కేబుల్ లను సైతం చీల్చుకొని వెళ్లి మరి వేర్లను విస్తరింప చేస్తుంది.. నిజానికి గల్ఫ్ దేశాలు ఈ మొక్క యొక్క ప్రతికూల ప్రభావాన్ని చూసి ఏనాడో నిషేధించాయి.  కానీ మన తెలుగు రాష్ట్రంలో మాత్రం హరితహారం లో భాగంగా కోనో కార్పస్ మొక్కకు విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ నాటేశారు. మొక్కే కదా అని ఎక్కడపడితే అక్కడ నాటడంతో ఒక వనం అయిపోయింది. ముఖ్యంగా మెట్రో నగరాలను మొదలుకొని గ్రామాలు ,తండాలు ఇలా ప్రతి చోట గ్రామ సచివాలయాల దగ్గర కూడా ఈ మొక్కలు విరివిగా కనిపిస్తున్నాయి.

ఈ మొక్క ప్రతికూల ప్రభావాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం జూన్ 15వ తేదీన కోణో కార్పస్ మొక్కపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  ఎక్కడ కూడా ఈ మొక్కలను నాటకూడదు అని ఆదేశాలు జారీ చేసినప్పటికీ హరితహారం కాస్త అప్రతిహతంగా మారిపోయింది. హైదరాబాద్ ,వరంగల్ తో పాటు కరీంనగర్ , నిజామాబాద్ ప్రధాన రహదారుల్లో డివైడర్ల మధ్యలో ఈ మొక్కలు నాటగా.. అవి ఇప్పుడు ఏపుగా పెరిగిపోయాయి. హైదరాబాదు శివారు గ్రామపంచాయతీలోని నర్సరీలలో ఈ మొక్కలు పెద్ద సంఖ్యలో ఉండడంతో జూలై, ఆగస్టు నెలలో వేగంగా కాలనీ మొత్తం నాటేశారు.. మరొకవైపు మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం పరిధిలోని కాఛ్వానిసింగారం గ్రామపంచాయతీ అధికారులు ఏకంగా తమ పరిధిలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ లోని పార్కుల్లో రెండు మూడేసి వరుసలలో ఈ మొక్కలను నాటారు.

మొక్కల వల్ల అటు పక్షి జాతి,  జంతు జాతి కి మాత్రమే కాదు మానవాళికి కూడా ప్రాణాంతకం కానుంది. ఈ మొక్క పుప్పొడి  వల్ల ఆస్తమా ,అలర్జీ వంటి శ్వాసకోస వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అంతేకాదు పశువులకు , పక్షులకు కూడా ఉపయోగపడని ఈ మొక్కల పెంపకంపై వైద్య నిపుణులు నిషేధం విధించినా కూడా ఇప్పటికే నాటిన మొక్కలు పెరిగి పెద్దవి అయిపోయాయి.  అందుకే వీలైనంత త్వరగా ఈ మొక్కలను తొలగించాలని.. వాటి స్థానంలో మన దేశీయ మొక్కలను మాత్రమే నాటాలని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  లేకపోతే మానవాళికి మరింత ప్రాణాంతకంగా మారనుంది అని కూడా హెచ్చరిస్తున్నారు.

నిజానికి ఫ్లోరిడో సముద్ర తీర ప్రాంతంలో మంగ్రూవా జాతి మొక్కగా పేరు తెచ్చుకున్న ఈ మొక్క వేగంగా.. ఏపుగా పెరిగి ఎడారుల నుంచి వచ్చే దుమ్ము , ఇసుక తుఫాన్లు,  వేడిగాలుల నుంచి రక్షణ గోడలా ఉంటుందని గల్ఫ్ దేశాలలో  విస్తృతంగా నాటేశారు.  ఆయా దేశాలను సందర్శించిన మన ప్లాంటేషన్ నిపుణులు కూడా దీనిని భారత్ కి  తీసుకువచ్చి నగరాలు,  పట్టణాలు,  గ్రామాల్లో విస్తరింప చేశారు. అయితే ప్రస్తుతం వీటి దుష్పరిణామాలు అర్థం చేసుకొని నిషేధించడం జరిగింది. కనీసం ఇప్పటికైనా ఈ మొక్కలను తొలగించాలని లేకపోతే కరోనా అంత ప్రమాదం జరుగుతుందని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: