వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ లో మార్పులు

Vimalatha
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిరంతరం తన వినియోగదారులకు మరింత ఈజీగా ఉండే ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ప్రస్తుతం ఉన్న 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ లో మార్పులు చేస్తోంది. తాజా సమాచారం వాట్సాప్ తన 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ను త్వరలో మార్చనున్నట్లు తెలుస్తోంది. WaBetaInfo తాజా నివేదిక ప్రకారం కంపెనీ ఈ ఫీచర్ కోసం సమయ పరిమితిని పెంచవచ్చు. 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్ వాస్తవానికి 2017లో వచ్చింది. ప్రస్తుతం మెసేజింగ్ సర్వీస్ దాని వినియోగదారులకు అందించిన అత్యంత ఉపయోగకరమైన, ముఖ్యమైన ఫీచర్లలో ఇది ఒకటి. ఈ ఆప్షన్ ద్వారా ఎవరైనా గ్రూప్‌కి లేదా పర్సనల్ చాట్‌కి పొరపాటున తప్పు సందేశం పంపితే వెంటనే డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ గతంలో ఏడు నిమిషాల కాలపరిమితితో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కొన్ని నెలల తర్వాత దానిని గంటకు పెంచింది. WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, ఇప్పుడు కంపెనీ ఈ ఫీచర్ కాల పరిమితిని నిరవధిక కాలానికి పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఇలా గంట కాకుండా ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చన్నమాట.

ప్రోగ్రెస్‌లో ఫీచర్
వాట్సాప్ v2.21.23.1 ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కొత్త డెవలప్‌మెంట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉందని, బీటా టెస్టర్‌లందరికీ అందుబాటులోకి వచ్చే వరకు ఈ కొత్త అప్‌డేట్ గురించి వినియోగదారులు పెద్దగా ఉత్సాహం చూపవద్దని నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను కంపెనీ యూజర్లకు ఎప్పుడు విడుదల చేయవచ్చో క్లారిటీ లేదు.

సందేశాన్ని తొలగించడానికి ఇప్పుడు మీకు ఒక గంట సమయం ఉంది
ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులు మెసేజింగ్ చాట్‌లలో వ్యక్తిగత, గ్రూప్ చాట్‌ల నుండి సందేశాలను తొలగించడానికి కేవలం ఒక గంట మాత్రమే ఉంది. సందేశం తొలగించబడిన తర్వాత యాప్ చాట్ విండోలో "ఈ సందేశం తొలగించబడింది" అని చెప్పే నోటిఫికేషన్‌ను చూపిస్తుంది. అయి, డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్‌లను కూడా చెక్ చేసుకునే మార్గాలు ఉన్నాయి.

ఇది కాకుండా, వాట్సాప్ iOS వెర్షన్ కొత్త వీడియో ప్లేబ్యాక్ ఇంటర్‌ఫేస్‌ ఫీచర్ ను తీసుకురాబోతున్నట్టు WABetaInfo సూచించింది. ఇది ఎవరైనా పూర్తి స్క్రీన్‌లో వీడియోను పాజ్ చేయడానికి లేదా ప్లే చేయడానికి లేదా పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) విండోను మూసివేయడానికి సహాయ పడుతుంది. యాప్ v2.21.220.15 iOS బీటా వెర్షన్‌ని ఉపయోగిస్తున్న కొంతమందికి ఈ ఫీచర్ ఇప్పటికే కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అక్టోబర్‌లో అందుబాటులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: