కార్డు పోయిందా టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే కొత్తకార్డు పొందవచ్చు...!
డ్రైవింగ్ లైసెన్స్
డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న వెంటనే ముందుగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు ఇచ్చే నాన్ ట్రేస్డ్ సర్టిఫికెట్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్‌ను లాస్ ఆర్ డిస్ట్రడన్ ఆఫ్ లైసెన్స్ అండ్ అప్లికేషన్ ఫర్ డూప్లికేట్ ఫారం(ఎల్‌ఎల్‌డీ)తో రోడ్డు రవాణా కార్యాలయం (ఆర్టీవో)లో అందించాలి. రూ.20 బాండ్ పేపర్‌పై కార్డు పోయిన వివరాలు తెలియ పరుస్తూ ఎల్‌ఎల్‌డీ ఫారంను సంబంధిత శాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా చేసిన పదిరోజుల్లోగానే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కార్డు వచ్చేస్తుంది.
రేషన్ కార్డు
ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకుల కోసమే కాకుండా ఆదాయం సహా పలు రకాల ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైనదని చెప్పాలి. రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపునకు కూడా ఎలాంటి ఢోకా ఉండదు. ఆదాయ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. ఈ కార్డు పోయినప్పుడు రేషన్ కార్డు నంబర్‌తో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలి. వారు అదే నంబర్‌లో నామమాత్రపు రుసుంతో కొత్త కార్డు జారీ చేస్తారు. వెబ్‌సైట్ ద్వారా జిరాక్స్ కాపీ పొందవచ్చు.
పాన్ కార్డు
పాన్‌కార్డు(పర్మినెంట్ అకౌంట్ నంబర్) పోతే సంబంధిత ఏజెన్సీలో పాత పాన్‌కార్డ్ జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస ధ్రువీకరణ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అదనంగా రూ.90 చెల్లిస్తే సరిపోతుంది. 20 రోజుల్లో పోయిన కార్డు స్థానంలో కొత్త కార్డును జారీ చేయడం జరుగుతుంది.
ఏటీఎం కార్డు
ఇప్పుడు బ్యాంకింగ్ లావాదేవీల్లో ఏటీఎం కార్డు పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే ప్రతీ ఒక్కరికి ఇది తప్పనిసరిగా మారిపోయింది. దీనిని పోగొట్టుకున్నా , ఎవరైనా దొంగిలించినా సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. సంబంధిత బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఏటీఎం కార్డును బ్లాక్ చేయించవచ్చు. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డు జారీ చేస్తారు. కొత్తకార్డు జారీ చేసినందుకు మాత్రం బ్యాంకులను బట్టి సర్వీసు చార్జీలు విధిస్తాయి.
ఓటరు కార్డు
కేవలం ఓటు వేయడానికి కాకుండా కొన్ని సార్లు నివాసం, పుట్టిన తేది ధ్రువీకరణ కోసం ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఓటరు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్ నంబర్, కార్డ్ నంబర్‌తోపాటు రూ.10 చెల్లించి, మీ సేవా కేంద్రంలో గానీ, గ్రామ, వార్డు సచివాలయంలో గానీ మళ్లీ కార్డు పొందే వీలు ఉంటుంది. కార్డు నెంబర్ ఆధారంగా సంబంధిత రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా అందజేస్తారు.
ఆధార్ కార్డు
ఈ కార్డు పోతే టోల్‌ఫ్రీ నంబర్ 18001801947కు కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే.. కొత్త కార్డు మళ్లీ పోస్టు ద్వారా పంపిస్తారు. వెబ్‌సైట్‌లోగానీ, గ్రామ, వార్డు సచివాలయాల్లో గానీ పూర్తి సమాచారం పొందవచ్చు.
పాస్‌పోర్ట్
పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు విచారణ జరిపి ఆచూకీ లభించకపోతే.. నాన్ ట్రేస్డ్ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అనంతరం పాస్‌పోర్ట్ అధికారి పేరిట రూ.1000 డీడీ తీయాలి. ఈ రెండింటినీ జతపరిచి దరఖాస్తు చేయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి డూప్లికేట్ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. దీనికి 3 నెలల కాలం పడుతుంది. తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి.