కెన్యాలో ఎయిర్టెల్ హైస్పీడ్ 4జీ.. 5జీ కూడా...
కెన్యాలోని ఎయిర్టెల్ వినియోగదారులు ఎటువంటి ఆటంకాలూ లేకుండా 5జీలోకి అప్‌గ్రేడ్ అయ్యేందుకు నోకియా నెట్వర్క్ సహకరించనుంది. దీనికోసం అవసరమైన మౌలిక సదపాయాలనూ కల్పించనుంది. అప్‌గ్రేడ్ అయిన కొత్త వినియోగదారులకు అత్యంత వేగవంతమైన నెట్వర్క్ సేవలను అందుబాటులోకి రానున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది.
కెన్యా రాజధాని నైరోబీలో వచ్చే ఏడాది జూన్ నుంచి 5జీ నెట్వర్క్ విస్తరణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. నైరోబీ సహా కెన్యాలోని అర్బన్, సెమీ అర్బన్, హైవేలు, టూరిస్ట్ స్పాట్స్ సహా మరికొన్ని జిల్లాల్లో ప్రస్తుతమున్న 2జీ, 3జీ, 4జీ రేడియో యాక్సెస్ నెట్వర్క్(రాన్) కవరేజ్ సదుపాయాలను ఆధునీకీకరించనున్నట్లు కూడా వెల్లడించింది.
ఎయిర్టెల్ విస్తరణపై కెన్యాలోని సంస్థ సీఈఓ పీడీ శర్మ స్పందించారు. తమ డేటా నెట్వర్క్ ఆధునీకీకరణతో పాటు కవరేజీని పెంచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల తమ వినియోగదారులకు మెరుగైన, హై-స్పీడ్ డేటా సేవలను అందించగలుగుతామని చెప్పారు. బ్రౌజింగ్, డేటా యూసేజ్లను కూడా వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో తమతో నోకియా కలిసి రావడం ఆనందంగా ఉందని, నోకియా టెక్నాలజీ పోర్ట్‌ఫోలియో తమ నెట్వర్క్ నాణ్యతను గణనీయంగా పెంచుతుందని చెప్పారు. భవిష్యత్తులో 5జీ సేవలకు వెళ్లడానికి కూడా అనుమతిస్తుందని పీడీ శర్మ పేర్కొన్నారు.