బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము

Prathap Kaluva

పుల్వామా ఘటన తో భారత్ పాక్ రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. దేశ ప్రజలు పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. పాకిస్థాన్ తో మ్యాచ్ లను బహిష్కరించాలని తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపధ్యం లో బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. వచ్చే మే 30 నుంచి ఇంగ్లండ్,వేల్స్ వేదికగా నిర్వహించే వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దవుతుందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.


భారత ప్రభుత్వం మ్యాచ్‌కు అంగీకరించని పక్షంలో దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరిగే ప్రస్తకి లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో భారత్ ఆడకపోయిన పక్షంలో మన జట్టు రెండుపాయింట్లు కోల్పోయే అవకాశం ఉందని, ఇందుకు ముందుగానే సిద్ధపడాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఐసీసీతో బీసీసీఐ ఎలాంటి సంప్రతింపులు, చర్చలు నిర్వహించలేదని తేల్చారు. ప్రపంచకప్ నిర్వహించే సమయం దగ్గరపడడంతో ఈ విషయంలో ఐసీసీ కూడా చేయడానికి ఏమీలేదు.


కేంద్ర ప్రభుత్వం భారత జట్టు ఆడొద్దని ఆదేశిస్తే మేం మ్యాచ్ ఆడేది లేదు. ఇప్పటివరకు ఐసీసీతో ఈ విషయం చర్చించాలని మేం అనుకోలేదు. ఈ మ్యాచ్‌లో మేం ఆడకున్నా పాకిస్థాన్ జట్టు పాయింట్లు దక్కించుకుంటుంది. ఒకవేళ రెండు జట్లు ఫైనల్ చేరితే ..పాకిస్థాన్ జట్టు ఆడకుండానే ప్రపంచ చాంపియన్‌గా నిలుస్తుంది అని సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.సరిహద్దు ఆవల నుంచి ఉగ్రవాదులకు మద్దతు అందిస్తూ భారత్‌లో నెత్తుటేరులు పారిస్తున్న పాకిస్థాన్‌తో భారత్ ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్ ఆడడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల్లో తలపడుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: