ఇక నేను ఓపెనింగ్ చేయకపోవచ్చు.. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్?
అనంతరం, రెండో టెస్ట్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారనే ప్రశ్నకు సమాధానమిస్తూ, “కె.ఎల్. రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు, నేను మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేస్తాను.” అని రోహిత్ స్పష్టంగా చెప్పారు. "బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడానికి నేను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాలంటే, రాహుల్, యశస్వి జైస్వాల్ చాలా బాగా ఆడారు. నేను నాకు బిడ్డ పుట్టినప్పుడు ఇంట్లోనే కొన్ని రోజులు గడిపాను ఆ సమయంలో రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ చూశాను. అప్పుడు నాకు ఓపెనింగ్ జోడిని మార్చకూడదని అనిపించింది. కానీ, వ్యక్తిగతంగా నేను ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమే. అయితే, జట్టు కోసం చూస్తే ఈ నిర్ణయమే సరైనది" అని రోహిత్ చెప్పారు.
పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజాలను జట్టులో ఎందుకు చేర్చలేదనే ప్రశ్నకు సమాధానమిస్తూ, "ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఈ ఇద్దరూ మనకు చాలా మ్యాచ్‌లు గెలిపించారు. ప్రతి మ్యాచ్‌కు అనుగుణంగా పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేయడమే మన లక్ష్యం, అదే మేం ఈ సిరీస్‌లో చేయబోతున్నాం" అని రోహిత్ చెప్పారు.
"మేము ఇక్కడ చాలా మ్యాచ్‌లు చూశాము, ఇక్కడ ఏం ఆశించాలనేది మాకు బాగా తెలుసు" అని రోహిత్ పరిస్థితుల గురించి చెప్పారు. జైస్వాల్, హర్షిత్ రాణా, నితిష్ కుమార్ వంటి యువ ఆటగాళ్లను రోహిత్ ప్రశంసించారు. "ఈ కొత్త తరం ఆటగాళ్లకు భయం ఏమీ ఉండదు. వారు గెలవాలనే కోరికతోనే ఉంటారు" అని రోహిత్ చెప్పారు. వాషింగ్టన్ సుందర్‌కు గాయాలు లేకుండా ఆరోగ్యంగా ఉండి, తన కెరీర్‌ను మెరుగుపరుచుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.