టీమిండియా ఊపిరి పీల్చుకో... రంగంలోకి దిగనున్న సెహ్వాగ్?

praveen
బీసీసీఐ రాబోయే రోజుల్లో పెను సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆటగాళ్లు, కోచ్, కెప్టెన్, సెలక్టర్లు.. ఇలా అన్ని విభాగాల్లో కూడా పెను మార్పులు తేవడానికి ప్లాన్ రెడీ చేసింది. వచ్చే ఐసీసీ ట్రోఫీల్లో ఖచ్చితంగా కప్పు గెలవాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంకో వారం రోజుల్లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుందనే విషయం అందరికీ తెలిసినదే. షెడ్యూల్ ప్రకారం రోజులు దగ్గర పడుతున్నా.. టీమిండియా జట్లను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న పురుషుల జట్టు సెలక్షన్ ప్యానెల్ పూరించేందుకు.. సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి విదితమే.
చేతన్ శర్మ రాజీనామాతో చైర్మన్ పోస్ట్ ఎలాగూ ఖాళీ అయింది. దీంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. దీనికోసం అభ్యర్థులకు కావాల్సిన క్వాలిఫికేషన్ ను నోటీసులో స్పష్టంగా పేర్కొంది. అయితే, చైర్మన్ పదవి రేసులో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం పురుషుల జట్టు సెలక్షన్ ప్యానల్ పై శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ ఉన్నారు. ఇకపోతే టీమిండియా సెలక్షన్ కమిటీ ఛీఫ్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడీ పోస్టులోకి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రాబోతున్నాడంటూ వార్తలు రావడం వీరూ అభిమానులను సంబరాలు చేసుకొనేలా చేస్తోంది.
ఛైర్మన్ పదవి నార్త్ జోన్ కి దక్కాల్సి ఉండటంతో ఈ రేసులో అందరి కంటే ముందు వీరూ ఉన్నట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ చేతన్ శర్మ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ టీమిండియాకు సంబంధించిన కీలక సమాచారం లీక్ చేసి దొరికిపోవడంతో రాజీనామా చేశాడు. ప్రస్తుతం ఆ పదవిలో శివ సుందర్ దాస్ ఉన్నాడు. అయితే అతడు ఈస్ట్ జోన్ కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. చేతన్ శర్మ నార్త్ జోన్ కావడంతో అక్కడి నుంచే వచ్చే వ్యక్తికే ఛైర్మన్ పదవి దక్కాల్సి ఉంది. ఆ లెక్కన సెహ్వాగ్ కు ఈ పదవి దక్కడం దాదాపు ఖాయమని పీటీఐ తన రిపోర్టులో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: