అతను హీరో అనుకుంటున్నాడు.. గిల్ చూసి నేర్చుకో?

praveen
2018లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా కీలక పాత్ర పోషించారు. ఆ జట్టులో వీరిద్దరూ రాణించినా.. ప్రస్తుతానికి వీరిలో ఒక్కరి మాత్రమే సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నారు. అన్ని క్రికెట్ ఫార్మాట్లలో శుభ్‌మన్ గిల్ భారత జట్టుకు ముఖ్యమైన ఆటగాడిగా మారాడు. మరోవైపు, ఒక్క ఫార్మాట్‌లోనైనా జాతీయ జట్టుకు ఎంపిక కాలేక షా సతమతమవుతున్నాడు. ఇక ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన ఇచ్చి సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడా అంటే అదీ లేకుండా పోయింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఓపెనర్‌గా కొనసాగుతున్న పృథ్వీ షా ఈసారి సీజన్‌లో దారుణమైన పర్ఫామెన్స్‌తో బాగా నిరాశపరిచాడు. 8 మ్యాచ్‌లు ఆడితే ఒక్కో మ్యాచ్ కి కనీసం 20 రన్స్ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే గిల్ చిన్ననాటి కోచ్ కర్సన్ ఘావ్రీ (Karsan Ghavri) పృథ్వీ షా వైఖరిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. పృథ్వీ షా ఇప్పటికే ఒక స్టార్‌గా ఫీల్ అయిపోతున్నాడని, తనని ఎవరూ టచ్ కూడా చేయలేరనే భ్రమలో ఉన్నాడని కోచ్ విమర్శలు చేశాడు. పృథ్వీ షా ఒక అహంకారిగా మారాడని లేదా ఓవర్ కాంఫిడెన్స్‌ వైఖరిని పెంచుకున్నాడన్నట్లు కోచ్ చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
శుభ్‌మన్ గిల్ చిన్ననాటి కోచ్ తాజాగా మాట్లాడుతూ.. పృథ్వీ షా తానొక స్టార్‌గా ఫీలవుతున్నాడని, ఇది మంచి వైఖరి కాదని అభిప్రాయపడ్డాడు. ఇంటర్నేషనల్ ఫార్మాట్ అయినా లేదా ఏ టోర్నమెంట్‌ అయినా సరే సింగిల్ డెలివరీ ప్లేయర్‌ని ఔట్ చేస్తుందని గ్రహించి ఫోకస్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అత్యున్నత స్థాయిలో విజయం సాధించాలంటే ఆటగాడికి క్రమశిక్షణ, నిలకడ అవసరమని గిల్ కోచ్ నొక్కి చెప్పాడు. టీమిండియా, IPL జట్టు కోసం ఈ లక్షణాలను నిరంతరం ప్రదర్శించడానికి షా చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు.
క్రీజును ఆధీనంలోకి తీసుకోవడానికి, పరుగుల వరద సృష్టించడానికి క్రమశిక్షణ చాలా కీలకమని కోచ్ వివరించాడు. గిల్ లాగా షా తన లోపాలను సరిదిద్దుకోవడానికి కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆటగాడిగా మెరుగవ్వాలని సలహా ఇచ్చారు. షా మంచి కంబ్యాక్ ఇవ్వడానికి, అతని సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇంకా చాలా టైమ్‌ ఉందని కూడా తెలిపారు. ఇప్పటికీ పోయిందేమీ లేదని ఇక నుంచి అయినా లోపాలను అధిగమించాలని షాకి ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: