అమ్మ.. హర్షితా స్కూల్.. ఇన్నిన్ని మోసాలా.. ?
తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించిన కేసు హర్షిత స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ యజమాని నందిగం రాణి ఎదుర్కొంటున్నారు. స్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు వారి బంధువుల నుంచి కూడా అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు సేకరించారని వారు చెపుతున్నారు. అయితే.. ఎంతకీ ఇవ్వకపోవడంతో వీరంతా కేసు పెట్టారు. దీంతో తమకు ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో రాణి సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ-2 నందిగం ధర్మరాజు సహా పలువురు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది.
ఈ కేసు ఇలా ఉంటే.. తాజాగా మరో కేసులోనూ స్కూల్‌కు ఎదురు దెబ్బతగిలింది. సాధారణంగా స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లిస్తారు. ఉపాధ్యాయుల వేతనాలు ప్రతి నెలా చివరకు ఇచ్చేస్తారు. కానీ, హర్షిత స్కూల్ యాజమాన్యం.. గురువులకు కూడా పంగనామాలు పెట్టే ప్రయత్నం చేసింది. వేతనం చెల్లించకుండా.. వారిని వేధింపులకు గురి చేసిందని అక్కడ పనిచేసిన ఉపాధ్యాయ సిబ్బంది గత యేడాది కాలంగా పోరాటం చేస్తున్నారు. దీనిపై ముప్పిడి సుబ్బారాయుడు అనే ఉపాధ్యాయుడు లోక్ అదాలత్‌ను ఆశ్రయించారు. 2023–2024 విద్యా సంవత్సరంలో హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్, జూనియర్ కాలేజీలో టీచర్‌గా చేరి 7వ నుండి 10వ తరగతి వరకు సోషల్ స్టడీస్ బోధించారు.
ఆయనకు నెలకు రూ.25,000 జీతం నిర్ణయించారు. సెప్టెంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు జీతం చెల్లించారు. అయితే మార్చి నుండి మే 2024 వరకు (3 నెలలు) మొత్తం రూ.75,000 జీతం చెల్లించలేదు. పలుమార్లు అడిగినా చెల్లించకపోవడంతో లోక్ అదాలత్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదాలత్ 10 శాతం వడ్డీతో కలిసి సుబ్బారాయుడుకు 75 వేల రూపాయలు చెల్లించాలని.. దీనికి అదనంగా కోర్టు ఖర్చుల నిమిత్తం మరో 5 వేల రూపాయలను కూడా ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఇతర ఉపాధ్యాయులు సైతం నందిగం రాణిపై తమ జీతాల కోసం న్యాయపోరాటానికి రెడీ అవుతున్నారు.