దెబ్బకు దెబ్బ... ప్రతీకారం తీర్చుకున్న సౌత్ ఆఫ్రికా?

VAMSI
సౌత్ ఆఫ్రికా జట్టు అనుకున్నట్లే చేసి చూపించింది. న్యూజిలాండ్ తో టెస్ట్ సీరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ ను 10 రోజుల క్రిందట ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయి విమర్శలను మూటగట్టుకుంది. అయితే సఫారీలకు పోరాట పటిమ ఏ మాత్రం తగ్గలేదు. మిగిలిన ఒక టెస్ట్ లో గెలిస్తేనే సీరీస్ సమం అవుతుంది లేదంటే సీరీస్ ఓటమి తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 25 నుండి మొదలైన రెండవ టెస్ట్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 364 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కీలక సమయంలో ఓపెనర్ సారెల్ ఎర్వీ 108 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
కివీస్ బౌలర్లలో వాగ్నర్ 4, హెన్రీ 3 మరియు సౌతి 2 వికెట్లు తీశారు. ఇక మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ను రబాడా మరియు జాన్సన్ బెంబేలెత్తించారు. రబాడా 5 మరియు జాన్సన్ 4 వికెట్లు తీసి కివీస్ ను 283 పరుగులకు పరిమితం చేశారు. ఇక దొరికిన 81 పరుగుల ఆధిక్యాన్ని సౌత్ ఆఫ్రికా రెండవ ఇన్నింగ్స్ లో వెరెయెన్ని (136) నాట్ ఔట్ సెంచరీ సాధించడంతో 354 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. కివీస్ 400 పై చిలుకు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ ఏ దశలోనూ లక్ష్యాన్ని సాధించేలా కనబడలేదు.
రెండవ ఇన్నింగ్స్ లోనూ రబాడా (3), జాన్సన్ (3) మరియు మహారాజ్ (3) వికెట్లతో చెలరేగి 227 పరుగులకు ఆల్ ఔట్ చేశారు. దీనితో రెండవ టెస్ట్ లో కివీస్ ను 198 పరుగుల తేడాతో ఓడించి రెండు టెస్ట్ ల సీరీస్ ను సమం చేసింది. మొదటి టెస్ట్ లో ఎదురైన పరాజయానికి వెంటనే బదులు తీర్చుకుని దెబ్బకు దెబ్బ వేసింది సౌత్ ఆఫ్రికా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: