తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం అనే నినాదం ద్వారా అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల పాటు ఏకధాటిగా పాలించింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసింది. అలాగే రాష్ట్రానికి ఎంతో అప్పు కూడా చేసి పెట్టింది. ఇవన్నీ దాస్తే దాగే విషయాలు కావు. అయితే ఏ పార్టీ ఎన్ని చేసినా, కానీ తప్పనిసరిగా కొన్ని ఏళ్ల తర్వాత ప్రజలకు మార్పు కావాలనుకుంటారు. అది ఎంతటి ఘనమైన పార్టీ అయినా సరే, ఎంతటి నాయకుడైనా సరే ప్రజలకు నచ్చితేనే ఉంటారు లేదంటే పాతాళంలోకి తొక్కేస్తారు. రాజకీయాల్లో పూర్తి స్థాయి అధికారం ఉండదు పూర్తిస్థాయి ప్రతిపక్షం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీని తిడుతూ కాలాయాపన చేస్తూ ఉంటారు.
వీరి మాటలకు అధికార పార్టీ కౌంటర్ ఇస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. కానీ తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మాత్రం ఎప్పుడో 10 సంవత్సరాల క్రింద విడిపోయినటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని ఎప్పుడూ ఆడి పోసుకుంటూనే ఉంటుంది. ప్రాంత విభజనను బట్టి అధికారంలోకి వచ్చింది. 10 ఏండ్లు పాలించింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మళ్లీ ఆ ప్రాంతాన్ని నిందిస్తూ తెలంగాణ ప్రజల్ని పక్కదారి పట్టిస్తోందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై కొన్ని ఆరోపణలు చేశారు. ఆంధ్రాలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణలో ఉన్నటువంటి తన శిష్యుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలోని హైదరాబాదును తన చేతిలో పెడతాడని, మళ్లీ మన బతుకులు వారి చేతుల్లోకి వెళ్తాయని ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ 10 ఏళ్లపాటు ఉమ్మడిగా ఉంటుందని అన్నారు. విభజన అయిన వెంటనే చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన హైదరాబాద్ పై ఏమాత్రం ఆధారపడకుండా సొంతంగా అమరావతి అనే రాజధానిని తీసుకొచ్చారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ వచ్చి కనీసం తెలంగాణలో పోటీ కూడా చేయడం లేదు. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు చంద్రబాబును అటు ఏపీ నాయకులను వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారిని అడ్డం పెట్టుకొని వీరి రాజకీయాల పబ్బం గడపడం తప్ప ఇంకేమీ లేదని, కలిసి ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.