'పీవీ సింధు'నే బ్రాండ్ అంబాసిడర్ గా మారనుందా.. ?

VAMSI
జపాన్ లోని టోక్యో నగరంలో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్ 2020 లో భారత బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కాంస్య పతకాన్ని సాధించి దేశమంతా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారు. తాజాగా జరిగిన పరిస్థితులు చూస్తే ఇప్పటికే తెలంగాణ క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియా మీర్జాను ఆ స్థానం నుండి తొలగించాలనే డిమాండ్ ఎక్కువవుతోంది. నిన్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సానియా మీర్జా స్థానంలో దేశానికి మెడల్ ను గెలిచిన పీవీ సింధును అంబాసిడర్ గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవిషయం వివాదంగా మారుతోంది. అంతే కాకుండా రాజా సింగ్ హాకీలో కాంస్య పతకాన్ని సాధించిన పురుషుల జట్టును సైతం ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా మరోసారి తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ క్రీడలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. దాదాపు తెరాస ప్రభుత్వం వచ్చినప్పటి నుండి క్రీడలకు అందిస్తున్న ప్రోత్సాహం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. కేవలం తెలంగాణ క్రీడా శాఖ మంత్రి తమ స్వార్థం కోసమే కృషి చేస్తున్నారని, క్రీడలను అభివృద్ధి చేసే కార్యక్రమాలపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఘాటుగా మాట్లాడారు. ఎంతో మంది క్రీడాకారులు సరైన సౌకర్యాలు మరియు సహకారం లేక ఇబ్బంది పడుతున్నారు. క్రీడా సిబ్బంది సైతం జీతాలు అందక రోడ్లపై నిరసనలు తెలిపే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.  కేసీఆర్ కన్నా ముందు పాలించిన పార్టీలనే క్రీడలకు తగిన ప్రాధాన్యాన్ని ఇచ్చారని కాంగ్రెస్ మరియు టీడీపీ ప్రభుత్వాలను కొనియాడారు.

ముఖ్యంగా తెలంగాణ క్రీడలకు బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను ఎలా నియమిస్తారని ప్రశ్నించాడు. సానియా మీర్జా ఇప్పుడు పాకిస్తాన్ దేశానికి కోడలిగా వెళ్లిన తరువాత ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగించడం సబబుగా లేదని అడిగాడు. ఈమెను కాకుండా మన దేశానికి రెండు ఒలింపిక్ పతకాలను సాధించిన పీవీ సింధును బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని గట్టిగా చెప్పారు. ప్రతి ఒక్కరూ పుట్టగానే గొప్ప క్రీడాకారుడు అయిపోరు. అందరూ మారుమూల ప్రాంతం నుండే పుట్టుకొస్తారు, ఎప్పుడైతే అలాంటివారికి ప్రభుత్వాలు సరైన సహకారం సౌకర్యాలు అందిస్తాయో వారే మనదేశానికి గర్వకారణం అవుతారని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ విధంగా వచ్చిన వారే సచిన్ మరియు ధోనీలు అని తెలిపారు. అయితే సానియా మీర్జాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. మరి కేసీఆర్ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: