రామదాసు హనుమకు దాసులమవుదాం! ఆరాధన సర్వదోష నివారణి

హనుమంతుడు ప్రత్యేకించి యువతరానికైతే ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత. ఆధ్యాత్మిక సాధకులకు సుందరాకాండ ఒక అద్భుత మార్గదర్శి. అపార శక్తి సామర్థ్యాలు, అమిత బలసంపన్నతలలో ఆంజనేయుడు అసాధ్యుడు.  ఆపదలో వున్న తన భక్తులను ఆదుకోవడానికి హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. అలాంటి హనుమని అనునిత్యం పూజించేవారు వుంటారు. ఆ స్వామికి ప్రదక్షిణలు చేసిన తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలను మొదలు పెట్టేవారు అధికమే. 

ఇక స్వామివారికి ప్రత్యేకించి పూజాభిషేకాలు చేయించేవారు మాత్రం, హనుమకు ఇష్టమైన మంగళవారం రోజున అవి చేయిస్తుంటారు. తమలపాకులతో పూజలు చేయించి ఆ స్వామికి ఇష్టమైన తియ్యని  అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన అనారోగ్యాలు ఆపదలు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. 

ఇక చాలా మంది శనివారం రోజున కూడా హనుమను పూజిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు. శనివారం రోజున హనుమ పూజ వలన, శని గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. 

శనివారం రోజున హనుమను పూజించేవారి జోలికి రానని ఒకానొక సందర్భంలో శనిదేవుడు, హనుమకు మాట ఇచ్చాడట. అందువల్లనే శనివారం రోజున హనుమను పూజిస్తే, శని దోష ప్రభావం తగ్గుతూ వెళుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన భక్తులకు ప్రతిరోజు పండుగరోజు ప్రత్యేకించి మంగళ శనివారాలు. హనుమ ఆరాధకులు హనుమ దండకం చదవటం ఉత్తమం. ప్రతిరోజూ చేసే వ్యాయామంతోపాటు ధైర్యసాహసాలను పుణికి పుచ్చుకోవడం ద్వారా స్వామికి నిజమైన వారసులు అనిపించు కుంటారు. 

హనుమంతుడు ఎంత శక్తివంతుడో అంత రామభక్తి పరాయణుడు. రాత్రిళ్లూ భయపడకుండా ఉండడానికి చాలామంది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆయన్ని ధ్యానిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే హనుమత్ దీక్షతో స్వామి అనుగ్రహం తథ్యమనీ పెద్దలు అంటారు. ప్రతిరోజూ శ్రీ పంచముఖ హనుమంతుని ఆరాధన అత్యంత శుభకరం. ఆంజనేయ దండకం, ఆపదుద్దారక స్తోత్రం, మంగళాష్టకం, పంచరత్నస్తోత్రం వంటివన్నీ మనకు జీవితంలో అడుగడుగునా శ్రీరామరక్షలా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: