విశాఖ: అరకులో విజయం ఎవరిని వరిస్తుంది?

Purushottham Vinay
ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం అరకు నియోజకవర్గంలో మొత్తం 2,32,337 మంది ఓటర్లు ఉన్నారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి మొత్తం మూడు ధఫాలు ఎన్నికలు జరిగాయి. 2009వ సంవత్సరంలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సివేరి సోమ 425 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి వంజంగి కాంతమ్మపై విజయం సాధించారు. సోమకు మొత్తం 34,959 ఓట్లు రాగా, కాంతమ్మకు అయితే 34,554 వచ్చాయి. 2014 వ సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ నుంచి తిరిగి సివేరి సోమ పోటీ చేయగా, వైసీపీ తరపున కిడారి సర్వేశ్వరరావు పోటీ చేశారు. సోమపై సర్వేశ్వరరావు 34,053 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.సర్వేశ్వరరావుకు ఏకంగా 63,700 ఓట్లు రాగా, సీవేరి సోమకు 29,647 ఓట్లు వచ్చాయి. అయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో మూడేళ్లు తరువాత కిడారి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019వ సంవత్సరం ఎన్నికల ముందు సర్వేశ్వరరావు, సోమ ఇద్దరూ మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు.


సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సర్వేశ్వరరావు కొడుకు శ్రావణ్‌కుమార్‌కు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారు. అలాగే 2019వ సంవత్సరం ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చారు. వైసీపీ తరపున చెట్టి ఫాల్గుణ ఇంకా ఇండిపెండెంట్‌గా సియ్యారి దొన్నుదొర పోటీ చేశారు.దొన్నుదొరపై ఫాల్గుణ ఏకంగా 25,481 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చెట్టి ఫాల్గుణకు ఏకంగా 53,101 ఓట్లు రాగా, దొన్నుదొరకు 27,620 వచ్చాయి. ఎన్నికల తరువాత దొన్నుదొర తెలుగు దేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో దొన్నుదొరనే పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.అందువల్ల ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే ఆ తరువాత మారిన సమీకరణాల్లో భాగంగా అరకులోయ సీటును తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి  తరపున పాంగి రాజారావు, వైసీపీ తరపున మత్స్యలింగం పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో సహా పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్నా...బీజేపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ జరుగుతుంది. చూడాలి మరి ఏమవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: