దీపావళి స్పెషల్ : పిండివంటలు.. టపాకాయలు.. పండగంటే ఇదే..!

Vasishta

పురాణాలు దీపావళి జరపాలని సూచిస్తే.... ఆ రోజు నిర్వహించే వేడుకలు పండుగల్లో మేటి దీపావళి అనే చేశాయి. నోరూరించే రుచులు.. బంధుమిత్రుల సరదాలు.. కానుకలు.. రాత్రి వేళల్లో మిరుమిట్లు గొలిపే దీపకాంతులు... హోరెత్తించే టపాసులు. దీపావళి అంటే ఓ మహా సంబరం..


దీపావళి రోజు లక్ష్మీ దేవికి ప్రత్యేకంగా పూజలు చేసి.. రకరకాల పిండివంటలతో నైవేద్యం సమర్పిస్తారు. కాలంతో మనుషులు పోటీ పడుతున్న ఈ రోజుల్లో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు ఎవరి హడావిడిలో వారు తలోచోట ఉంటున్నారు. దీపావళి రోజు కుటుంబంతో కలిసి సంబరాలు జరుపుకుంటారు. పసందైన పిండివంటలు చేసుకుని కడుపారా తింటారు. స్నేహితులకు, అయినవారికి పిండివంటలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలుపుతారు.


దీపావళి అంటేనే కలర్ ఫుల్ పండుగ. ఆ రోజు మార్నింగ్ నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. నిజం చెప్పాలంటే వారం ముందు నుంచే వీధుల్లో చిన్న పిల్లల టపాసుల మోత మొదలైపోతుంది. దీపావళి రోజున అంతా కొత్త బట్టలతో కళకళాలాడిపోతుంటారు. పల్లెల నుంచి గ్రేటర్ సిటీస్ వరకు న్యూ లుక్ తో మెరిసిపోతాంటాయి.


ఇక ఫైనల్ ఘట్టం సాయంత్రం నుంచి మొదలవుతుంది. అంతెత్తున కాంతులు చిమ్మే చిచ్చుబుడ్డులు, భూమిపై మెరుపులు కుమ్మరించే భూచక్రాలు.. ఆకాశంలో రయ్యి మని దూసుకుపోయే రాకెట్లు.. మతాబులు పొగ, సీమటపాసుల మోత.. అబ్బా ఒక్కటేమిటే సూర్యుడు పక్కకు తప్పకుంటే చాలు... వీధులన్నీ మోతలతో మారుమోగాల్సిందే.


పూర్వ కాలంలో దీపావళి అంటే పూజలు, దీపాలు మాత్రమే. అప్పట్లో రాత్రి పూట గడ్డిని కాల్చేవాళ్లు. కాలక్రమంలో టపాసులు వచ్చాయి. ఇప్పుడు అవి మితి మీరిపోయి దీపావళి అంటే టాపాసులే అనే రేంజ్ కి పెరిగిపోయాయి.. దీపావళి అంటే దీపాల పండుగ. సో టపాసులు, దీపాలు వాటికి తోడు పండగ కాబట్టి కొత్త బట్టలు కామన్. కానీ ఇప్పుడు ఏ పండగైనా అన్ని వ్యాపారాలకీ పండగే. పండగ పేరుచెప్పుకుని సూపర్ బిజినెస్ చేసేసుకుంటున్నారు. దీపావళి అనగానే ఫస్ట్ కొనేది ప్రమిదలు. ఒకప్పుడు మామూలుగా ఉండే మట్టి ప్రమిదల్లో నెయ్యి గానీ నూనె గానీ వేసి దీపాలు వెలిగించేవారు. ఇప్పుడు ఆ దీపాల్లోనూ ట్రెండ్ మారింది. రకరకాల ఆకృతులు, డిఫరెంట్ డిజైన్లతో వేలకు వేలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఆధునీకత మరీ పెరిగిపోయి క్యాండిల్ దీపాలు కూడా వచ్చేశాయి..


ఇక నెక్స్ట్ వస్త్రాలు. దేవి నవరాత్రులకు ముందు నుంచే..... దసరా, దీపావళి ఆఫర్స్ అంటూ హోరెత్తించేస్తారు వస్త్ర వ్యాపారులు. రకరకాల డిస్కౌంట్లు, 1+1 ఆఫర్లతో జనాన్ని ఆకర్షిస్తారు. అంతేకాకుండా బంపర్ డ్రా లు అంటూ బాగానే అమ్మకాలు సాగిస్తున్నారు. దీపావళి రోజు లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు కాబట్టి బంగారం కొనుగోళ్లు సైతం బాగానే జరుగుతున్నాయి.


దీపావళికి ప్రెజంట్ అత్యంత ముఖ్యమైన ఐటం టపాసులు. ఒకప్పుడు రెండు మూడు రకాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏడాది ఏడాదికి టపాసుల్లో రకాలు పెరిగిపోతున్నాయి. 50రూపాయల టపాసుల నుంచి లక్షరూపాయల టపాసుల వరకు దొరకుతున్నాయి. స్తోమతకు తగ్గట్లుగా కొనుగోలుదారులు టపాసులు కొంటున్నారు. కాకపోతే ఒకప్పటితో పోల్చి చూస్తే టపాసుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు..


షాపింగ్ మాల్స్ కల్చర్ వచ్చిన తర్వాత ప్రతి పండగకూ ఆఫర్లే. అందునా దీపావళికి ఈ ఆఫర్లు మరీ ఎట్రాక్టివ్ గా ఉంటున్నాయి. గ్రాసరీ సామాన్ల నుంచి, స్టీలు సామాన్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇలా అన్ని వస్తువులపై డిస్కౌంట్లు ప్రకటించడంతో పండగ రోజుల్లో వ్యాపారాలు బాగా పేలుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: