చ‌రిత్ర పుట‌ల్లో కామ‌వ‌ర‌పుకోట‌ వాలీ సుగ్రీవుల గ‌ట్టు... వంద‌ల ఏళ్లుగా ప్ర‌పంచానికి తెలియ‌ని ర‌హ‌స్యం..!

- ( ఆధ్యాత్మికం - ఇండియా హెరాల్డ్ )

ఎన్నో చారిత్ర‌క ప్ర‌దేశాలు... ఎంతో ప్రాశ‌స్త్యం క‌లిగి ఉన్నా కూడా చ‌రిత్ర పుట‌ల్లోకి ఎప్పుడో ... ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఎవ్వ‌రి ఆద‌ర‌ణ‌కు నోచుకోక అలాగే ఉండిపోతూ ఉంటాయి. అయితే అక్క‌డ‌కు స్వ‌యంగా వెళ్లి చూస్తే గాని ఇంత అద్భుత‌మైన చ‌రిత్ర ఉందా ? అని ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు. ఏలూరు జిల్లాలోని ప్ర‌ముఖ ప్రసిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన ద్వార‌కాతిరుమ‌ల‌కు 9 కిలోమీట‌ర్ల దూరంలో వాలీ సుగ్రీవుల గ‌ట్టు ఉంది. కామ‌వ‌ర‌పుకోట మండ‌ల కేంద్రానికి కేవ‌లం 3 కిలోమీట‌ర్ల దూరంలోనే పాతూరు గ్రామం చివ‌ర‌న ఈ గ‌ట్టు ఉంది.

ఈ గ‌ట్టు ఎందుకంత అద్భుతం... ఎన్ని సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌...
వాలీ సుగ్రీవుల గ‌ట్టు కింద అద్భుత‌మైన విగ్ర‌హాలు.. చ‌రిత్ర ఉంది. వాలీ సుగ్రీవుల గ‌ట్టుకు ఎన్ని సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉంద‌న్న‌ది ఖ‌చ్చితంగా ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. గ్రామ పూర్వీకులు... వారి తాత‌. ముత్తాత‌ల నుంచి సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం క‌లియుగం ఉన్న‌ప్ప‌టి నుంచి ఈ గ‌ట్టు ఉంద‌ని చెప్పేవారు ఉన్నారు. గౌత‌మ బుద్ధుడి కాలంలోనే ఈ గ‌ట్టు చ‌రిత్ర‌కు బీజం ప‌డింద‌ని కూడా కొంద‌రు చెపుతుంటారు.

వాలీసుగ్రీవుల గ‌ట్టు కింద - వాలీసుగ్రీవుల ఏక‌శిలా విగ్ర‌హాలు ఉన్నాయి. వాలీ, సుగ్రీవుడు ఇద్ద‌రూ యుద్ధం చేసుకున్న‌ట్టుగా ఇవి ఉంటాయి. తారా దేవి కోసం జ‌రిగిన పోరాటంలో వాలీ, సుగ్రీవులు ప‌ర‌స్ప‌రం త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిందే. ఇక్క‌డ కూడా వాలీ, సుగ్రీవుడు ఇద్ద‌రూ ఎదురెదురుగా పోరాటం చేస్తున్న‌ట్టుగా ఏక‌శిలా విగ్ర‌హాలు ఉంటాయి. ఒక్కో విగ్ర‌హం 8 అడుగుల ఎత్తుతో పాటు 3 అడుగుల మందంతో ఉంటుంది. ఇక గ‌ట్టుపైన ఏక‌రాతి మీద గ‌ర్ముత్మంతుడు విగ్ర‌హం ఉంది. ఇది తారాదేవి గుడి కింది భాగంలో ఏక రాతిమీద ఉంది. ఇది 7 అడుగుల ఎత్తుతో పాటు 2 అడుగుల మందంతో ఉంది. పైన గుడిలో తారాదేవి అమ్మ‌వారితో పాటు ఈ గుడిని ఆనుకునే రాముల వారి పాదాలు ఉన్నాయి.

అలాగే ప్ర‌థ‌మ గుడి ( చీక‌టి గ‌ది)లో ద్వార పాల‌కులు జ‌య‌, విజ‌య‌లుతో పాటు చీక‌టి గ‌ది లోప‌ల ఉన్న మ‌రో గ‌దిలో గ‌రుడ పీఠం ఉంది. ఈ గ‌రుడ పీఠంపై విష్ణు విగ్ర‌హం ఉంద‌ని పూర్వీకులు చెపుతుంటారు. అతి పెద్ద భారీ రాళ్ల మ‌ధ్య‌లో చీక‌టి గ‌దితో పాటు ముఖ‌ద్వారాన్ని నాటి శిల్ప కారులు ఎలా చెక్కారో ఇప్ప‌ట‌కీ అర్థం కాదు.. అంత అద్భుతంగా ఉంటుంది. అయితే కొన్నేళ్ల క్రింద‌ట వ‌ర‌కు ఇక్క‌డ కార్తీక మాసంలో ప్ర‌తి మంగ‌ళ‌వారం తిరునాళ్లు నిర్వ‌హించేవారు. ఈ క్ర‌మంలోనే పాతూరు గ్రామానికి చెందిన కొంద‌రు భ‌క్తులు బ‌లుసు పోత‌య్య , వుయ్యూరు రామ‌కృష్ణ‌, ఘంటా రాఘ‌వులు, వాన‌రాసి వీర‌రాఘ‌వులు తిరుమ‌ల తిరుప‌తి నుంచి రామ‌ల‌క్ష్మ‌ణ సీతాదేవి, ఆంజ‌నేయ‌ విగ్ర‌హాల‌ను తీసుకువ‌చ్చి ప్ర‌తిష్టించారు.

చీక‌టి గ‌ది లోప‌ల గ‌రుడ పీఠంపై ఎక్కువుగా నీరు ఉంటుంది. ఈ క్ర‌మంలోనే వ‌ర్షపు నీటితో పాటు గ‌బ్బిలాట పెంట‌తో గ‌రుడ పీఠంపై ప్ర‌తిష్టించిన రామ‌ల‌క్ష్మ‌ణుల విగ్ర‌హాలు మునిగిపోయాయి. ఇక చీక‌టి గ‌దిలో ఈ స్థ‌లం ప్రాశ‌స్త్యం తెలిపేలా శాస‌నం ఉంది. అది పాళీ భాషే అని ఎక్కువ మంది అధ్య‌య‌న కారులు.. పూర్వీకులు చెపుతూ ఉంటారు. ఇక తార‌దేవి గుడి.. ఇటు చీక‌టి గ‌దిపైన గురుజు పీఠం ఉంది. నాలుగు వైపులా చ‌తుర‌స్త్రాకారం కోణంలో ఉన్న ఈ పీఠాన్ని కొంద‌రు ఆగంత‌కులు గుప్త నిధుల పేరుతో కొన్నేళ్ల క్రితం త‌వ్వేసి ధ్వంసం చేశారు. అలాగే కింద ఉన్న ఏక‌శిలా విగ్ర‌హాలు అయిన వాలీ సుగ్రీవుల విగ్ర‌హాల కింద భాగంలో త‌వ్వేందుకు విఫ‌ల‌య‌త్నం చేశారు.

కార్తీక మాసంలో ప్ర‌తి మంగ‌ళ‌వారం తిరునాళ్లు...
ఇక కార్తీక మాసంలో ప్ర‌తి సోమ‌వారం ఇదే మండ‌లంలో ఉన్న గుంటుప‌ల్లి ( జీల‌క‌ర్ర‌గూడెం) బౌద్ధ గుహ‌ల ద‌గ్గ‌ర తిరునాళ్లు జ‌రిగితే.. ప్ర‌తి మంగ‌ళ‌వారం వాలీసుగ్రీవ క్షేత్రంలో తిరునాళ్లు నిర్వ‌హించేవారు. దివంగ‌త బ‌లుసు పోత‌య్య గారు రెండు ద‌శాబ్దాల పాటు ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తూ వ‌చ్చారు. మూడో మంగ‌ళ‌వారం స్థానికంగా ఉన్న అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు అప్ప‌ట్లో సెల‌వు కూడా ఉండేది. ఆయ‌న అనంత‌రం కొంద‌రు తాత్కాలికంగా కార్తీక‌మాసంలో పూజ‌లు చేసినా ప్ర‌భుత్వం వైపు నుంచి గాని.. ఈ క్షేత్రం వైపు శీత‌క‌న్ను ఉండ‌డంతో అభివృద్ధికి నోచుకోక వెలుగులోకి రాలేదు. ఇక అప్ప‌ట్లో పిల్ల‌లు లేని మ‌హిళ‌లు పైన తారాదేవి గుడి మెట్ల దిగువ‌భాగంలో పానాచారాలు ప‌డ‌డం చేసేవారు. ఇక ఈ క్షేత్రం నుంచే అప్ప‌ట్లో ముస్లిం పాల‌కులు మండ‌ల కేంద్ర‌మైన కామ‌వ‌ర‌పుకోటను పాలించిన రెడ్డి రాజ్యాన్నికూల‌గొట్టేందుకు ఈ గ‌ట్టు నుంచే ఫిరంగుల‌తో కామ‌వ‌ర‌పుకోట గ‌ట్టుపై దాడి చేసిన ఆన‌వాళ్లు..చ‌రిత్ర ఇప్ప‌ట‌కీ ఉంది. ఆ టైంలో తారాదేవి విగ్ర‌హాన్ని కొంత పాక్షికంగా ధ్వంసం చేశార‌ని చెపుతుంటారు.

మ‌ళ్లీ గ‌త రెండేళ్లుగా ఇక్క‌డ కార్తీక మాసంలో ప్ర‌తి మంగ‌ళ‌వారం పూజ‌లు చేసి తిరునాళ్లు నిర్వ‌హిస్తున్నారు. గ‌ట్టు కింద నుంచి పైకి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేశారు. అలాగే మూడో కార్తీక‌ మంగ‌ళ‌వారం అఖండ అన్న‌స‌మారాధ‌న నిర్వ‌హిస్తున్నారు నిర్వాహ‌హ‌కులు.. ఈ యేడాది కూడా మూడో మంగ‌ళ‌వారం అయిన ఈ నెల 19న క్షేత్రంలో అఖండ అన్న స‌మారాధ‌న ఉంది. ప్ర‌భుత్వం నుంచి క‌నీసం గ‌ట్టుపైకి స‌రైన ర‌హ‌దారితో పాటు విద్యుత్, మంచినీటి సౌక‌ర్యం ఏర్పాటు చేయ‌డంతో పాటు ఈ క్షేత్రం అభివృద్ధికి స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటే వంద‌ల ఏళ్లుగా మ‌రుగున ప‌డిన గొప్ప చ‌రిత్ర వెలుగులోకి రావ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: