వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయకండి..!
ఈ పూజ చేసేవారు వ్రతం రోజు ఉదయాన్నే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేసి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గు పెట్టాలి. చక్కగా ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసి వరలక్ష్మి వ్రతానికి మండపాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత మండపంలో బియ్యం పిండితో ముగ్గు వేసి , కలశాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేయాలి.
ఇక పూజ చేయడానికి కంటే ముందు వ్రత నియమాలను తప్పకుండా పాటించాలి. పూజా సామాగ్రి, పసుపు గణపతిని, అక్షింతలను తోరణాలను ముందే సిద్ధం చేసుకుని పూజకు ఉపక్రమించాలి. అమ్మవారికి ఇష్టమైన పిండివంటలు నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేయాలి. పూజ ముగిసిన తరువాత ముత్తైదువులకు పసుపు, కుంకుమ ఇచ్చి పండు తాంబూలంలో పెట్టి వాయినంగా వాళ్లకి ఇవ్వాలి.
అయితే వరలక్ష్మీ వ్రతం రోజు నియమ నిష్టలతో పూజలు చేయడమే కాకుండా కొన్ని పనులు చేయకూడదని చెబుతున్నారు పండితులు. అది ఏంటంటే వరలక్ష్మీ వ్రతం రోజు కలశాన్ని ఏర్పాటు చేసుకున్న వారు ఆ కలశాన్ని గాజు ప్లేట్లో పెట్టకూడదట. అలాగే కలశాన్ని వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఏ పూజకైనా గణపతి మొదలు కాబట్టి , పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతనే లక్ష్మీదేవికి పూజ చేయాలి. అంతేకాదు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్న ఇంట్లో ఎవరు కూడా వ్రతం రోజు కోపతాపాలకు వెళ్ళకూడదు .ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.