శభాష్.. తిరుమల తిరుపతి దేవస్థానం గోసేవ అదుర్స్?
ఇప్పటికే తిరుపతిలోని ఇస్కాన్ లో గో అధారిత వ్యవసాయదారుల సంఘం, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా ఇటీవల రాయలసీమ సేంద్రియ మేళా ఏర్పాటు చేశాయి. అక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ గో ఆధారిత వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న రైతులను ఆకట్టుకున్నాయి. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, వాటి ప్రాముఖ్యతను రైతులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. దేశీయ ఆవుల పెంపకంపై టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
గత ఏడాది మే నెల నుంచి గో ఆధారిత వ్యవసాయం, గోవిందునికి గో ఆధారిత నైవేద్యం కార్యక్రమాన్ని టీటీడీ అమలు చేస్తోంది. అంతే కాదు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన దాదాపు 2 వేల టన్నుల శెనగ పప్పును సేంద్రీయ వ్యవసాయంతో పండించిన రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. గత ఆరు నెలల్లో ప్రకృతి వ్యవసాయదారులకు 2000 దేశీయ ఆవులను విరాళంగా అందజేసింది. ఎస్వీ గోశాలలో నెయ్యి తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది.
అలాగే.. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ముందు అనేక ప్రాజెక్టులు చేపట్టాలన్న ఆలోచనలో ఉంది. ఇటీవలే వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో సంయుక్తంగా డ్రైఫ్లవర్ విధానంతో స్వామి, అమ్మవార్ల ల్యామినేటెడ్ ఫోటోలు తయారు చేయిస్తోంది కూడా. ఈ వస్తువులకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది కూడా. డ్రై ఫ్లవర్ టెక్నాలజితో మహిళలు తయారు చేస్తున్న కళాకృతులను కొనుగోలు దారులను ఆకట్టుకుంటున్నాయి. 200 మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. ఆరు నెలలలుగా స్వామివారి ఆకృతులను, వివిధ కళాకృతులను తయారు చేస్తున్నారు.