తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి మెట్ల మార్గం భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల దివ్య క్షేత్రం నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. స్వామి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటారు. ఇందులో దాదాపు 3 వేల మంది వరకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ కొండపైకి వెళుతుంటారు. కోరిన కోర్కెలు నెరవేరినందుకు నడక మార్గంలో స్వామి వారికి తమ మొక్కులు తీర్చుకుంటారు. ప్రస్తుతం భక్తులు కొండపైకి చేరుకునేందుకు రెండు మెట్ల మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం. మరొకటి శ్రీవారి మెట్టు మార్గం. ఎక్కువ మంది భక్తులు అలిపిరి మెట్ల మార్గం ద్వారానే సప్త గిరులు ఎక్కుతుంటారు.
అలిపిరి మార్గం పూర్తిగా ఆధునీకరించేందుకు టీటీడీ భారీ ప్రణాళిక రూపొందించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత సౌకర్య వంతంగా మెట్లు నిర్మించేందుకు టీటీడీ ప్లాన్ చేసింది. ఇందుకోసం మొత్తం 25 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ మొత్తం కూడా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఖర్చు చేస్తున్నారు. గతేడాదే పనులు ప్రారంభమైనప్పటికీ... కొవిడ్ కారణంగా మరమ్మతు పనులు ముందుకు సాగలేదు. నాటి నుంచి కూడా అలిపిరి మెట్లు మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మూసివేశారు. దీంతో ప్రస్తుతం భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. గతేడాది ఆగస్టు నాటికే పూర్తి కావాల్సిన పనులు... ఆలస్యమయ్యాయి. ఇప్పుడు ఆధునీకీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం లైటింగ్, పెయింటింగ్ పనులు శర వేగంతో పూర్తి చేస్తున్నారు అధికారులు. ఈ ఏడాది దసరా నవరాత్రుల సమయానికి అన్ని పూర్తి చేయాలని ముందుగా టార్గెట్ పెట్టుకున్నారు. అయితే అనుకున్న సమయాని కంటే ముందుగానే అక్టోబర్ ఒకటి నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.... పూర్తి సౌకర్య వంతంగా మెట్లు నిర్మించామన్నారు. అలాగే.. భక్తుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: