ఇన్నిదేశాలు ఉండగా... ఇక్కడే ఎందుకు...

సంస్కృతీ, సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా చెప్పుకునే భారతదేశం ప్రతి ఏటా ఎంతో మంది విదేశీయులను ఆకర్షిస్తుంది. వారి జీవన విధానంలో లేని ఏదో తృప్తిని ఇక్కడ వెతుక్కుంటూ వాళ్ళందరూ భారత్ వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు వారివారి దేశాలను పూర్తిగా వదిలేసి మరీ ఇక్కడే జీవిస్తూ ఉన్నారు. ఇక్కడి జీవన విధానం, ఆ విధానాన్ని నడిపించే ప్రాచీన ధర్మ గ్రంధాల సారం వారూ వంట పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి దేశంలో వారికి దక్కని శాంతిని ఇక్కడ వెతుక్కోడానికి వచ్చి, ఇక్కడే ఉండిపోయినవారూ లేకపోలేదు. ఇది పాశ్చాత్య దేశాలలో మనదేశ ఘనత.
కానీ ఇక్కడ ఉన్నవారు దానికి మచ్చ తెచ్చే విధంగా బ్రతుకుతుండటం శోచనీయం. నిజమే ఎవరిది వారికి కనిపించదు, రుచించదు కూడా. పక్కింటి పుల్ల కూర బహురుచి అని ఊరికే సామెతలు వచ్చిఉండవు కదా..! ఈ తరహాలోనే ఎక్కడో ఉన్న వారికి భారత్ నచ్చిందని, ఇక్కడి వారికి మాత్రం రుచించట్లేదని అనుకోవడం సమంజసమే. కానీ, పాశ్చాత్యులు ఇక్కడకు ఒక మెట్టు జీవిత ప్రయాణాన్ని ఎక్కడానికి వస్తున్నారు, మన వాళ్ళు మాత్రం లేనిపోని ఇతరమైన సంస్కృతికి బానిసలై అసలు అందులో లేని శాశ్వత ఆనందాన్ని వెతుక్కుంటూ జీవన గమనంలో ఎన్నో మెట్లు దిగజారిపోతున్నారు.
ఈ నేలపై పుట్టిన బిడ్డల కష్టాలు ముందే ఊహించాడేమో అందుకే, ఇల వెలిశాడు ఆ ఇలవేల్పు. మరెక్కడో మనసుపోతున్న ఈ జనం మాదిరి ఆయన కూడా ఎక్కడో వెలిసి ఉండొచ్చు కదా, ఇక్కడే ఎందుకు.. అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా..! ఈ ఆలోచన వచ్చిన ఒక యువకుడు వాళ్ళ నానమ్మను అడిగాడట, అప్పుడు ఆమె ఇలా చెప్పిందిట. ఎప్పుడో జన్యుపరమైన అనారోగ్యం వలన ఉప్పు మానేసి తింటున్న ఒకాయన, 70 ఏళ్ళ వయసులో వాళ్ళ ఆవిడ వండిన కూరలో ఉప్పు లేదని అరుచుకుంటూ చిరాకుగా బయటకు వెళ్ళాడట. అలా వారం తరువాత నవ్వుకుంటూ ప్రశాంతమైన ముఖంతో ఇంటికొచ్చాడు ఆ ముసలి ఆయన. అప్పుడు కూడా భోజనం పెడుతూ భార్య పిల్లలు బాగున్నారా అని అడిగిందట. దానికి ఆయన బాగానే ఉన్నారు అని చెప్పాడట.
ఇదంతా విన్న తరువాత, నేను అడిగింది ఏమిటి నువ్వు చెప్పింది ఏమిటి అన్నాడట ఆ యువకుడు వాళ్ళ నానమ్మతో. అప్పుడు ఆమె నవ్వుతు, నాన్న ఆ ముసలాయన భార్య చేసిన వంట బాగాలేదని ఇంటి నుండి వెళ్లిపోలేదు, అది సాకు మాత్రమే. నిజానికి ఆయన తన పిల్లలని చూడాలని తపించిపోతూ, కూరలో ఉప్పు లేదనే సాకుతో, ఆ కోరిక తీర్చుకున్నాడు. అలాగే, అందరికి తల్లితండ్రి అయినటువంటి ఆ భగవంతుడు కూడా ముసలాయన మాదిరే మహార్షి తన గుండెలపై తన్నాడనే సాకుతో బిడ్డల కోసం భూమిపై, అదీ భారత భూమిపై వెలిశాడు, అని చెప్పిందట. పిల్లలపై పిచ్చిప్రేమ ఇద్దరికే ఉంటుంది, కన్న తల్లితండ్రులకు, వారు కనే ముందు ఆ పిండాలకు ప్రాణం పోసి తల్లితండ్రులైన భగవంతుడికి.
అయినా ఈ కష్టాలు ఎందుకంటారా..కన్న తల్లితండ్రులు బిడ్డకి ఐస్ క్రీం కొనిపెట్టరు, ఎందుకంటే అది తిని జలుబు గట్రా ఏమైనా వస్తే పిల్లలు ఇబ్బంది పడతారని. అసలు అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు వారి తల్లితండ్రులు పడే కష్టం అంతాఇంతా కాదు. అయినా పిల్లలు చెపితే వినరు. ఐస్ క్రీం కావాల్సిందే అంటారు, కొనిపించుకుంటారు, తింటారు, జలుబులు తెచ్చుకొని, సూది పొడిపించుకొని, ఏడుస్తారు. ఇక్కడ ఎవరి కారణంగా కష్టాలు వచ్చాయో అర్ధం చేసుకుంటే, సమాధానం దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: