హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క మరియు హిందువులు దైవ సంభూతంగా కొలిచే తులసి మొక్క వారికి ఎంతో పవిత్రమైనది. పరమ పవిత్రంగా కొలిచే ఈ తులసి మొక్క కోటను దాదాపు అందరి ఇంటి ముందు పెట్టుకుంటారు. తులసి మొక్కను సాక్షాత్తు ఆ లక్ష్మీ మాత యొక్క మరో రూపంగా భావించి నిత్యం పూజలు చేస్తూ ఆరాధిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, మన హిందూ ఆచారంలో ఉన్నాయి. తులసి మొక్క వున్న చోట త్రిమూర్తులు కొలువై ఉంటారు అన్నది శాస్త్రం. తులసి మొక్క పరమ పవిత్రతకు నిదర్శనంగా భావిస్తారు.
తులసి పూజ చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ మన కుటుంబంపై ఉంటుందని, అలాగే పూజ చేసే మహిళ యొక్క మాంగల్యం చిరకాలం నిలుస్తుందని మన హిందువుల విశ్వాసం. తులసి చెట్టును ఇంటి ఆవరణలో పెట్టుకున్నవారు నిత్యం దీపం పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇలా దీపం పెట్టి నిత్యం పూజించడం వలన ఆ కుటుంబానికి ఎన్నో శుభాలు జరుగుతాయి. ఇక తులసి మొక్కను ఎవరైతే తమ ఇంట్లో నాటాలి అనుకుంటారో, అలాంటి వారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. తులసి మొక్కను నాటడానికి ద్వాదశి, తొలి ఏకాదశి వంటి రోజులను అత్యంత శ్రేష్టమైనవిగా చెబుతున్నారు. లేదా మంచి సమయం చూసుకొని శుక్రవారం నాడు నాటినా మంచి జరుగుతుంది.
అయితే తులసి మొక్కను నాటే సమయంలో మీరు ఖచ్చితంగా స్నానం ఆచరించి.. శుభ్రమైన దుస్తులను ధరించి ఉండాలి. అలాగే ముందుగా కాస్త పసుపు కుంకుమ చల్లి, ఆ తరువాత తులసి మొక్కను నాటి నిత్యం పూజించడం వల్ల ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాకుండా తులసి చెట్టు కింద కనుక శాలి గ్రామ రాయిని శనివారం రోజున పెట్టాలి. ఇలా చేస్తే మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం.