ఇదియే కంచి పరమాచార్యవైభవం

ఒకసారి ఒక భక్తుడు మంత్రాలయ రాఘవేంద్రస్వామి వారి బృందావనం దర్శించాలని మద్రాసు నుంచి ‘బాంబే మెయిల్’లో ప్రయాణం చేస్తున్నాడు. అతను చాలా నిద్రమత్తులో ఉన్నాడు. ఆ రైలు ఒక స్టేషన్లో ఆగగానే తను దిగవలసిన స్టేషన్ అనుకుని గాబరాగా దిగేశాడు. రైలు వెళ్ళిపోయిన త‌ర్వాత‌ తీరా తనుదిగిన స్టేషను బోర్డు చూస్తే అది ‘గుంతకల్లు’ అని ఉంది. “అరెరె! దేవుడా ఎంత పనైయిపోయింది. నేను ఇక్కడే దిగేశాను” అనుకున్నాడు.
శ్రీమఠం భక్తుడు జోషి, అతని మిత్రబృందం కూడా అదే రైలులో వచ్చారు. వారు అలా కంగారుగా నిలబడున్న భక్తుణ్ణి విషయం ఏమిటని అడ‌గ్గా.. ” నిద్ర మత్తులో ఇక్కడ దిగిపోయాను. నేను మంత్రాలయం వెళ్ళాలి” అని చెప్పాడు. అప్పుడు కంచి పరమాచార్య స్వామి వారు హగరిలో(బళ్ళారి జిల్లా) మకాం చేస్తున్నారు. జోషి బృందం మహాస్వామి వారి దర్శనం కోసమే వెళ్తున్నారు. అపుడు జోషి ఆ భక్తునితో, ”నువ్వు ఆదమరచి తత్తరపాటులో ఇక్కడ దిగలేదు. ప్రశాంత స్థితిలోనే దిగావు. సరే హగరికి వెళ్ళి మహాస్వామి వారి దర్శనం చేసుకుందాం పదా” అని అతణ్ణి తమతో పాటు తీసుకువెళ్ళారు.
జోషి బృందం మహాస్వామి వారికి సాష్టాంగ న‌మ‌స్కారం చేసి ఒక పక్కగా నిలుచున్నారు వేరేవాళ్ళకు దర్శనం చేసుకునే వీలు క‌ల్పించేందుకు. స్వామి వారు ఎప్పటిలాగానే వచ్చినవారందరి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మంత్రాలయ భక్తుడు రాగానే మహాస్వామి వారు జోషితో, “ఇతను ఇక్కడికి రావాల్సిన వాడు కాదు. మీరు తీసుకుని వచ్చారా?” అని అడిగారు.
ఆ భక్తుడు కొద్దిగా భయపడుతూ, “మీ దర్శనం చేసుకోకుండా మంత్రాలయం వెళ్ళాలనుకున్నాను. అందుకనే వెళ్ళలేకపోయాను” అని చెప్పాడు. మహాస్వామి వారు అతణ్ణి దగ్గరికి పిలిచారు. చాలాసేపు అతనితో చిన్నగా మాట్లాడారు. అప్పుడప్పుడు ఆ భక్తుడు అవునన్నట్టు తల ఊపుతున్నాడు.
ఆ భక్తుని తల్లిగారు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. “అలాగా?” అని అడిగారు స్వామివారు. ”అవును” అని బదులిచ్చాడు. ”వెంటనే నీవు గయకు వెళ్ళి మీ తల్లిగారికి శ్రాద్ధం పెట్టు. ఆవిడ ముక్తి పొందుతుంది” అని చెప్పారు. త‌ర్వాత ఆ భక్తుడు మావద్దకు వచ్చి జరిగిన విషయమంతా మాతో చెప్పి పరమాచార్య స్వామి వారు ఇలా ఆజ్ఞాపించారు అని చెప్పాడు.
అప్పుడు జోషి వాళ్ళతో, “బావిలో పడి చనిపోయిన ఆమె ఆత్మ మహాస్వామి వారివద్ద తన వ్య‌థ‌ను చెప్పుకొని ఉంటుంది. అందుకే మహాస్వామి వారు వాళ్ళ అబ్బాయిని గుంతకల్లులో దిగేట్టు చేసి, తమ దర్శనానికి రప్పించుకున్నారు” అని చెప్పాడు.
ఈ సర్వేశ్వరునికి ఆత్మల భాష కూడా తెలుసనుకుంటా. లేదంటే ఆమె అలా బలవంతంగా ప్రాణాలు తీసుకుందని వారికెలా తెలుస్తుంది. సామాన్యుల‌మైన‌ మనకేం తెలుసు!!
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: